Feb 20,2023 08:42

సాహిత్య పిపాస గల ఉన్నతాధికారులు చాలా అరుదు. అలాంటి వారిలో ఒకరు అంగలకుర్తి విద్యాసాగర్‌. తనదైన భావుకతతో, బాణీతో ఉన్నత భావాలను పరిమళింపచేయడం ఆయన సాహిత్య ప్రక్రియ. సాహిత్యం ఆయన జీవితంలో అంతర్వాహిని. పని ఒత్తిడిలో అలసిపోయినప్పుడు సాహిత్యాన్ని ఒక సాంత్వనగా చేసుకొని, అలసట తీర్చుకునే తత్వం తనది. వృత్తిలో ఎదురైన వాస్తవ సంఘటనలు మిగిల్చిన అనుభవాలకు అక్షర రూపం చెక్కి, తనదైన శైలితో కధా సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. అందుకు నిలువెత్తు సాక్ష్యం 'భద్రాచలం మన్నెం కథలు'. తాను ఐటిడిఎ పివోగా ఉన్న కాలంలో అక్కడి గిరిజన బతుకుల్లోని వెతల్ని, సంస్క ృతిని, ప్రకృతి అందాలను పరిశీలించి, తన అనుభవాలను జోడించి ఆ కథలు రాశారు.
            విద్యాసాగర్‌ది వసుధైక తాత్విక దక్పథం. అందుకే తన కవిత్వంలో ఒక చోట 'నేను పాడే పాట/ విశ్వాన్ని నాలోకి సదా ఒంపుకొంటున్న/ వో సెలయేటి పిలుపు' అంటాడు. విశ్వాంతరాలను ఆవాహన చేసుకుంటాడు. అదే సమయంలో ఊరి పొలిమేర్లు దాటి, పల్లెల్లోకి, గూడేల్లోకి వెళతాడు. గుడిసెల్లో మొండి గోడల మధ్య పగిలిన జీవితాలను, అద్దప్పెంకులను సందర్శిస్తాడు. కరెంటు లేని గూడేలు, గూట్లో దీపాలు, మొండి గోడకు పేడతో అలికి అతికించిన అద్దప్పెంకులు తన కవిత్వంలో ప్రతిఫలింప చేస్తాడు, 'దీగుడు కింద అద్దప్పెంకులో/ విశ్వమే ఓ శకలమైంది' అంటాడు. ఉన్నత వర్గాల గదుల్లో నిలువుటద్దాల్లో విశ్వం కనపడదు. మొండి గోడలకతికించిన అద్దప్పెంకులో విశ్వాన్ని ఇమడ్చటం గొప్ప వ్యక్తీకరణ. ఇది దళిత సౌందర్య శాస్త్రానికి అద్దం పడుతుంది. అమ్మకు ప్రకృతితో ఉన్న సంబంధాన్ని తన కవిత్వంలో 'అమ్మా ఆకాశాలు కవల పిల్లలే' అంటాడు విద్యాసాగర్‌.
        విద్యాసాగర్‌ 'నగరానికొచ్చిన నాగళ్ళు' సంకలనంలో తన భావజాలం ఊరినుంచి మొదలై, ఓ ప్రాంతం :అస్తిత్వం దాకా సాగుతుంది. ఆర్ధిక వనరుల పంపకం అనేది సామాజిక వర్గాల చైతన్య స్థాయిని బట్టి జరుగుతుంది. ఇది ప్రాంతాలకు వర్తిస్తుంది. అందుచేత ప్రాంతాలు విడిపోవడమనేది కేవలం భావన కాదు. దాని వెనకున్న ఆర్థిక అసమానతే కారణం. ఈ అసమానతలు కొన్ని సామాజిక వర్గాల అస్తిత్వాన్ని తుంచివేయడం ఎంతో కాలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోంచే దేశం నుంచి రాష్ట్రాలు, రాష్ట్రం నుంచి ప్రాంతాలుగా విడివడిన సందర్భాలు ఉత్పన్నం అయ్యాయి. దేశ వ్యాప్తంగానూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వాడిగా, అధ్యయన శీలిగా, సమాజంలో జరుగుతున్న పరిణామాలకు స్పందించే కవిగా, తన అనంత అంతరాల్లో కలిగిన స్పందనలను 'నగరానికొచ్చిన నాగళ్ళు' సంకలనంగా కవిత్వీకరించాడు విద్యాసాగర్‌. ఈ సంకలనంలో కేవలం కవిత్వం కోసం కవిత్వం రాయలేదు. ఇప్పటి దాకా అనేక మంది ఆస్తిత్వాన్ని వివిధ రీతుల్లో చెప్తున్న ఆధిపత్య భావజాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రతిపాదించాడు ఇందులో.
        విద్యాసాగర్‌ ప్రకాశం జిల్లాలో బాగా వెనుకబడ్డ ప్రాంతమైన కనిగిరికి యాభై కిలోమీటర్ల దూరంలో అరివేముల అనే కుగ్రామంలో 1956లో నవమణి, ఆనందం అయ్యవార్లకు జన్మించాడు. వీధి బడినుంచి ఢిల్లీ దాకా తన విద్యా ప్రస్థానం సాగింది. తల్లి కోరిక మేరకు ఐఏఎస్‌ అయ్యాడు. తన అధికారాన్ని ఎక్కువగా గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాడు. వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అదే సమయంలో తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం విద్యాసాగర్‌ది. 'మనిషొకడే విడిగా మనలేదు', 'అసలు సంతకం', 'విశాఖా... నా విశాఖా!' మొదలైన కవితా సంకలనాల్లో తన గొంతును బలంగా వినిపించాడు. ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా కేవలం దానికే పరిమితం కాలేదు. ఒక పరిశోధకుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా ప్రతి సందర్భాన్ని అక్షర బద్ధం చేశాడు. కొన్ని సందర్భాల్లో అధికారిగా పరిమితులు ఉన్నా .. కవిగా, రచయితగా మాత్రం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచాడు. తన రచనల్లోని అక్షరక్షరం అదే స్వరాన్ని వినిపిస్తుంది.

- కత్తి కళ్యాణ్‌
63038 47077