Aug 22,2023 21:29

బాకు(అజర్‌బైజాన్‌): ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద టాప్‌సీడ్‌ మాగస్‌ కార్ల్‌సన్‌ను నిలువరించాడు. మంగళవారం జరిగిన ఫైనల్‌ తొలిపోటీలో 18ఏళ్ల ప్రజ్ఞానంద 35ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించాడు. సోమవారం జరిగిన సెమీస్‌లో ప్రజ్ఞానంద 3వ సీడ్‌, అమెరికాకు చెందిన 3వ ర్యాంకర్‌ ఫాబినో కరువానాను టై బ్రేక్‌లో ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఆ సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5పాయింట్ల తేడాతో కరువానాను చిత్తుచేసి విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే 2024లో జరిగే క్యాండిడేట్‌ ఛాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించాడు. కార్ల్‌సన్‌తో గత 6నెలల్లో ఐదుసార్లు తలపడిన ప్రజ్ఞానంద మూడుసార్లు విజయం సాధించడం విశేషం.