Aug 27,2023 06:41

పిల్లలు టీవీకి అతుక్కుపోతున్నారు. వారి దృష్టి మళ్లించాలన్న ఓ తండ్రి ఆలోచన ఆ ఇంటి పిల్లవాడిని విశ్వ యవనికపై విజేతగా నిలిపేలా చేసింది. తాజాగా నిర్వహించిన ప్రపంచ చెస్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన ఆర్‌.ప్రజ్ఞానంద గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. ఈ పోటీల్లో అతడు రెండో స్థానానికే పరిమితమైనా ప్రపంచ చెస్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద తండ్రి రమేష్‌బాబు పోలియో బాధితుడు. బ్యాంకు ఉద్యోగి. తల్లి నాగలక్ష్మి గృహిణి. అక్క వైశాలి. తెలుగు మూలాలున్న ఈ కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు. తండ్రి సంపాదనతోనే ఇల్లు గడిచేది. చిన్ని చిన్ని సంతోషాలు, ఆనందాలతో సరదాగా సాగుతున్న ఆ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన టీవీ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. పిల్లలు టీవీకీ అతుక్కుపోయేవారు. ఎంత చెప్పినా వినేవారు కాదు. పిల్లల విషయంలో రమేష్‌, నాగలక్ష్మి చాలా మధనపడేవారు. ఎలాగైనా పిల్లలను టీవీ నుండి దృష్టి మళ్లించాలని చెస్‌, డ్రాయింగ్‌ నేర్పించడం మొదలుపెట్టారు. పెద్దదైన వైశాలి చాలా త్వరగానే చెస్‌పై ఆసక్తి పెంచుకుంది. అక్క ఆటను చూస్తున్న ప్రజ్ఞానంద కూడా ఆటపై మక్కువ చూపించేవాడు. అలా రెండేళ్ల ప్రాయం నుండే చదరంగ పావులపై పట్టు సాధించడం మొదలుపెట్టాడు. స్వల్ప కాలంలోనే అక్క కంటే నాలుగు ఎత్తులు ఎక్కువే నేర్చుకున్నాడు. అప్పటికే టోర్నమెంట్లలో పాల్గొంటూ మహిళా గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగిన అక్క వైశాలీయే ఆశ్చర్యపోయే ఆటతీరు కనబర్చేవాడు. 2018 నాటికి రాష్ట్ర గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించి తల్లిదండ్రులను సంతోషంలో ముంచెత్తాడు. ఈ రికార్డు రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా, ప్రపంచంలోనే రెండవ అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.

3

టీవీ నుండి దృష్టి మళ్లించేందుకే ...

ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయకేతనాలు ఎగరేస్తున్న ప్రజ్ఞానంద ప్రగతిని చూస్తున్న తండ్రి ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండాపోయాయి. 'ప్రగ్‌ (అతన్ని ఎక్కువగా అలాగే పిలుస్తారు) ఇంత విజయం సాధిస్తాడని మేం అసలు ఊహించలేదు. పిల్లలు టీవీ చూడకుండా ఉండేందుకు సరదాగా నేర్పించిన ఆటతో వీరు ఇన్ని అద్భుతాలు సృష్టిస్తుంటే చాలా సంతోషమేస్తోంది' అంటూ తాజాగా కొడుకు సాధించిన విజయంతో ఆ తండ్రి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

12 ఏళ్లకే గ్రాండ్‌ మాస్టర్‌..

ఆరేళ్లకే అండర్‌-7 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండవ స్థానంలో నిలిచాడు ప్రగ్‌. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. ఆ తరువాత వరుసగా అండర్‌-8, అండర్‌-10 ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలుచుకుంటూ తన విజయపరంపరను కొనసాగించాడు. పదేళ్లు వచ్చేసరికి అంతర్జాతీయ మాస్టర్‌గా అసాధారణ ప్రతిభ చూపాడు. ఈ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కుడిగా చెస్‌ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించాడు. ఆ తరువాత రెండేళ్లకే 12 ఏళ్లప్పుడు అంతర్జాతీయ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను సాధించాడు.

3

అమ్మంటే అంతే ...

తాజాగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీ.. బాకులో జరుగుతున్న టోర్నమెంట్‌కు ప్రగ్‌ సిద్ధమవుతున్నాడు. అప్పటికే పలు స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ చూపాడు. ప్రత్యర్థి ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ, అలవోకగా పావులను అటూ ఇటూ కదిలించే ప్రజ్ఞానంద ఇంటర్వ్యూల కోసం, అతని ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు సిద్ధమయ్యారు. అప్పుడే అక్కడికి వచ్చాడు ప్రగ్‌. ఆట తీరుపై తన ఆలోచనలపై మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడే సాదాసీదాగా చీరకట్టుతో ఉన్న ఓ మహిళ ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది.
ప్రగ్‌ మాట్లాడుతున్నప్పుడు అతనివైపే చూస్తోంది ఆమె. ఆ చూపులో ప్రేమ, ఆప్యాయతే కాదు.. అందనంత ఎత్తు ఎదిగిన కొడుకును చూసి మురిసిపోతోందా తల్లి.. తన ఆనందం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంత సంతోషాన్ని తట్టుకోలేక ఆ కళ్లు సంద్రాలై వర్షిస్తుంటే చీరకొంగుతో వాటిని అదిమిపెట్టడం చూసిన కెమెరా కన్ను ఆ అపురూప క్షణాలను క్లిక్‌ మనిపించాయి. ఆ దృశ్యాలను చూసిన చెస్‌ ప్రేమికులు 'అమ్మంటే.. అంతే.. బిడ్డ ఉన్నతిని చూసి మురిసిపోతుంది' అంటూ ప్రశంసలు కురిపించారు.

వంట కుక్కర్‌ తీసుకెళ్తుంది..

ప్రగ్‌తో పాటే నాగలక్ష్మి ప్రతి టోర్నమెంట్‌కు హాజరవుతుంది. కొడుకుతో పాటు ప్రపంచం చుట్టేస్తున్న ఆమె తనతో ఓ వంట కుక్కర్‌ని కూడా తీసుకొస్తుంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆమె పడుతున్న ఆరాటం అందులో కనపడుతోంది.

ధైర్యం చెబుతుంది..

ఆట అన్న తరువాత గెలుపోటములు సహజం. అలా ప్రగ్‌ ఆడిన ప్రతి ఆటలో అతని విజయాలకే కాదు.. అపజయాలకు కూడా అమ్మ తోడుంటుంది. 'అమ్మ నా వెంట వచ్చేది.. నాకు ఇష్టమైన రసం, అన్నం వండిపెట్టడానికే కాదు.. ఓటమి వల్ల నేను కుంగిపోకుండా ఎంతో ధైర్యం చెబుతుంది. ఒత్తిడితో ఉన్న మాలాంటి వారికి ఈ రకమైన ప్రోత్సాహం చాలా అవసరం. అందరికీ ఈ అవకాశం రాదు. నాకు మాత్రం మా అమ్మ ఉంది. ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. నాకే కాదు.. అక్క వైశాలీ ఆడే టోర్నమెంట్లకు కూడా అమ్మ వెంటే ఉంటుంది' అంటూ ఈ సందర్భంలో ప్రగ్నానంద అమ్మ గురించి గొప్పగా చెప్పాడు.

4

ఆమె వల్లే పిల్లలు ఎదిగారు..

'ప్రగ్‌ పదేళ్ల నుండి అంతర్జాతీయ ప్రదర్శనలు ఇస్తున్నాడు. అతనితో పాటే నాగలక్ష్మి కూడా ప్రయాణిస్తుంది. ప్రగ్‌ విజయంలో ఆమె ప్రోత్సాహం చాలా ఉంది. తను లేకపోతే పిల్లలు ఈ స్థాయికి వచ్చేవారు కాదేమో.. అందుకే పిల్లల పట్లే కాదు.. నాగలక్ష్మి గురించి కూడా నాకు గర్వంగా ఉంటుంది' అంటున్నాడు రమేష్‌బాబు.
ఇద్దరు బిడ్డలూ చెస్‌లో రాణించడం గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ.. బిడ్డలిద్దరినీ ప్రోత్సహించేందుకు ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిపోదు. ఈ కారణంగా మొదట్లో ప్రగ్‌ని ఆటలో నిలువరించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ ఎంతోకాలం ఆ మాటపై ఉండలేకపోయారు. శక్తికి మించి మరీ ప్రజ్ఞానందని కూడా ఆటలో ప్రోత్సహించారు. బిడ్డల ఇష్టాయిష్టాలు తెలుసుకోవడమే కాదు, ఆ దారిలో వారి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న రమేష్‌బాబు, నాగలక్ష్మి ఎంతోమంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.