Aug 24,2023 22:15

బాకు(అజర్‌బైజాన్‌): ఫిడే ప్రపంచకప్‌ చెస్‌ టై బ్రేక్‌లో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన రెండో టై బ్రేక్‌లో 18ఏళ్ల ప్రజ్ఞానంద టాప్‌సీడ్‌ మాగస్‌ కార్ల్‌సన్‌ చేతిలో పోరాడి ఓడాడు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన ఫైనల్‌ పోరులో తొలి రెండు గేమ్‌లు 1ా1తో డ్రా కావడంతో విజేతను నిర్ణయించే టై బ్రేక్‌ కీలకం అయింది. తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద వరల్డ్‌ నంబర్‌వన్‌కు చెమటలు పట్టించాడు. ఏమాత్రం బెరుకు లేకుండా ఆడిన అతను కార్ల్‌సన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే.. ర్యాపిడ్‌ చెస్‌లో దూకుడు కనబర్చలేక మ్యాచ్‌తో పాటు ట్రోఫీ చేజార్చుకున్నాడు. గతంలో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద ఈసారి మాత్రం అదే ఫలితం సాధించలేకపోయాడు. దాంతో, చరిత్రకు ఒక్క అడుగు దూరంలో నిలిచినా అందరి మనసులు గెలుచుకున్నాడు. దీంతో కార్ల్‌సన్‌ తొలి ఫిడే ప్రపంచకప్‌ ట్రోఫీని సొంతం చేసుకోగా.. ప్రజ్ఞానంద రన్నరప్‌ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు. ఇక ఇటలీకి చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరునావా మూడో స్థానంలో నిలిచాడు. దీంతో వీరు ముగ్గురూ క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌-2024కు అర్హత సాధించారు. టైటిల్‌ విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు రూ. 91లక్షలు, రన్నరప్‌ ప్రజ్ఞానందకు రూ.66 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
దేశం గర్వించేలా చేశావు: సచిన్‌ టెండూల్కర్‌
ఫిడే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన రమేశ్‌బాబు ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫైనల్లో టైబ్రేక్‌ ఓడిన ప్రజ్ఞానందకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. 'టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడినందుకు అభినందనలు. నీ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండు. దేశం గర్వపడేలా చేశావు' అని పేర్కొన్నాడు.