నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ; భాషా సాంస్క ృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా, భారత్ రంగ మహౌత్సవాన్ని ఈనెల 19 నుంచి 23 వరకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌డిగా పిలువబడే 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా' ప్రపంచంలోనే అగ్రగామి శిక్షణా సంస్థల్లో ఒకటి. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను 1959లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రంలో నాటక రంగ కార్యకలాపాలు నాటక సమాజాల వారి ద్వారా స్వచ్ఛందంగా విరివిగా జరుగుతున్నా, పరిమితమైన అవగాహన వల్ల జాతీయ అంతర్జాతీయ నాటక రంగంతో పోల్చినప్పుడు ఆ నాటక ప్రదర్శనలు పేలవంగానే కనబడతాయి. అధిక శాతం. కొత్త కొత్త ప్రయోగాలు వాటిని ప్రోత్సహించే ప్రత్యేక మార్గదర్శక సంస్థ ఒక్కటి కూడా లేకపోవడం వల్ల, మన రాష్ట్రంలో నాటక రంగానికి దశా దిశా నిర్దేశం కొరవడింది. ందులోనూ ఈనాటి సాంకేతి యుగంలో అది మరింత వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకనాటి నాటక రంగ ఉజ్వలమైన రోజుల్ని తిరిగి ఉద్దీపింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌డి శాఖనొక దానిని స్థాపించాల్సిన అవసరం గుర్తించింది.

ఆ దిశగా రాష్ట్రంలో ఎన్‌ఎస్‌డి ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదనలు సమర్పించింది. ఆ దిశగా రాజమండ్రిలో 22వ భారత్ రంగ మహౌత్సవం (థియేటర్ ఫెస్టివల్) నిర్వహించింది. ఫిబ్రవరి 19న శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్, హైదరాబాద్ వారిచే 'భక్త ప్రహ్లాద' పౌరాణిక నాటకం; 20న అస్తిత్వ థియేటర్ గ్రూపు మంగుళూరు వారిచే 'కండోనియన్స్' నాటకం; 21న అస్పోర్టివ్ థియేటర్ స్పేస్ గ్రూప్ పాలక్కాడు వారిచే ఎల్‌ఐబి (లెట్ ఇట్ బి) నాటకం, 22న బ్యాక్ ఆన్ స్టేజ్ థియేటర్ గ్రూప్ బెంగళూరు వారిచే శ్మశాన కురుక్షేత్రం నాటకం, 23న
మనలంగుడి థియేటర్ ల్యాండ్ గ్రూప్, కోవిల్ పట్టి తమిళనాడు వారిచే ఇడాకిని కథయారథం నాటకం ప్రదర్శనలు జరిగాయి.

ఇవీ, ఇతివృత్తాలు
1 స్తంభంలో శ్రీహరిని చూపించమన్నందుకు స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ వెలువడిన శ్రీమహావిష్ణువు నరసింహావతారం హిరణ్యకశిపుని సంహరించటం- భక్త ప్రహ్లాద నాటక ఇతివృత్తం.
2. 'కండోనియన్స్' నాటకం- ఒక సాధారణ టీ స్టాల్ యజమాని, వీసా ఏజెంట్ ద్వారా కండోనియన్ అనే దేశంలో పడరాని పాట్లు పడి సర్కస్‌లో కోతిలా భుక్తి కోసం పనిచేసే క్రమంలో బూటకపు ప్రపంచపు డొల్లతనం అతడికి అనుభవంలోకి వస్తుంది.
3. పుస్తకాలను ఎంతో ఇష్టపడే ఒక లైబ్రేరియన్ అనేక భాషల రచయితలను వారి రచనల్లోని పాత్రలను కలుసుకుంటాడు. పుస్తకంలో కనిపించని ఒక పేజీని తిరిగి సంపాదించే ప్రయత్నంలో ప్రసిద్ధులైన వారినెందరితోనో సంభాషిస్తాడు. చివరకు లైబ్రరీ అంటే 'ఒక గతించిన జ్ఞాపకం' అని తన వెతుకులాటలో గమనిస్తాడు.
4. 'శ్మశాన కురుక్షేత్రం' నాటకాన్ని ప్రసిద్ధ మలయాళ కవి కువెంపు రాశారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధపు భయంకర పరిణామాలను క్లుప్తీకరించి చూపిస్తుంది, ఈ నాటకం.
5. 'ఇడాకిని కథయారథం' వలసల కారణంగా చరిత్ర అంతటా అనేకమంది మానవులు నాశనం అయిపోయిన విధం, మానవ పరిణామ క్రమంలో వలసలు ఎలాంటి విపరిణామాలకు దారితీశాయో చెబుతుంది. ఇప్పటికీ అనివార్యంగా కొనసాగుతున్న వలసల క్రమాన్ని విప్పి చెబుతుంది ఈ నాటకం.
సాహిత్య సాంస్కృతికపరంగా విశిష్టమైన స్థానం కలిగిన రాజమహేంద్రిలో ఈ భారత్ రంగ మహౌత్సవం జరగడం మంచి పరిణామం. ఇది తెలుగు నాటక రంగాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన చరిత్ర పుట కాగలదు. ప్రదర్శించిన నాటకాలను విశ్లేషణాత్మకంగా వాటి వస్తు, ప్రదర్శనా వైవిధ్యతను ఇలా చెప్పుకోవచ్చు.
కండోనియన్స్ : దామన్న, ఒక సాధారణ టీ స్టాల్ యజమాని,. మోసగాడైన వీసా ఏజెంట్ ద్వారా 'కండోనియన్' అనే దేశంలో పడరాని పాట్లు పడతాడు. ప్రదర్శనను ప్రయోగాత్మక శైలిలో దర్శకుడు తీర్చిదిద్దిన తీరు, రంగాలంకరణ, రంగోద్దీపనం .. చాలా కొత్తగా అనిపిస్తాయి. నటీనటులు, సాంకేతిక వర్గం కలిసి నాటక ఇతివృత్తాన్ని ఎంతగా పండించవచ్చునో, సమాజాన్ని విమర్శనాత్మకంగా చూపిస్తూనే ప్రేక్షకులను ఆలోచనలో పడవేసి, దిశానిర్దేశం ఇచ్చే ప్రదర్శనగా ఎలా రూపొందించ వచ్చో రుజువు చేసింది ఈ సందేశాత్మక కన్నడ నాటకం.

LIB (Let it bother) : ఇది మలయాళ నాటకం: కొందరికి వృత్తితో ఎంత అనుబంధం ఏర్పడిపోతుందంటే అందులో విరమణ పొందినా మనసు ఆ పని ప్రదేశంలో తారట్లాడుతూ ఉంటుంది. ఒక గ్రంథ పాలకుని (ఈ మనోదశనే రచయిత చూపిస్తూ) యొక్క భావోద్వేగాలను స్వగతంలోనే అయినా బిగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటాడు. బ్రెV్‌ా్ట థియరీ ప్రకారం- ప్రేక్షకుడు ఒళ్ళు మర్చిపోయి లీనమైపోకుండా, అతడు పూర్తి స్పృహలో ఉండి, జరిగేది నాటకం, తాను చూస్తున్నది ఒక కల్పిత కళారూపం అని అనుక్షణం గుర్తు చేస్తూ తాదాత్మ్య విచ్చిత్తినే ప్రతిపాదిస్తాడు. అందువల్ల ప్రేక్షకుడిని సచేతనంగా ఉంచి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకొని పోయేలా చేయకూడదన్నది ఆ థియరీ. ఈ నాటికలో అలా ఒక భావ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా చేసే పాత్రలు ఒక మగ, ఆడ ఎలుకలు. వాటితో సంభాషించడం, అవి చెప్పినట్లు ప్రధాన పాత్ర నడుచుకోవడం. గ్రంథాలయాల ఉనికి ప్రశ్నార్ధకంలో పడుతున్న నేపథ్యంలో, గ్రంథాలయంలో కనిపించకుండా పోయిన ఒక పుస్తకంలోని చివరి పేజీ కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు ఆ గ్రంథ పాలకుడు. చీకటి వెలుగుల మధ్య మానసిక భావోద్వేగాలకు తగ్గ సంగీతపు హెచ్చుతగ్గులు ప్రేక్షకుడిని, 55 నిమిషాల పాటు రెప్పవాల్చకుండా చూసేలా చేస్తాయి. అదే లెట్ ఇట్ బోదర్ నాటకం.
శ్మశాన కురుక్షేత్ర : ఎన్‌ఎస్‌డి శిక్షణ పొందిన 2009 బ్యాచ్ నటీ, దర్శకురాలు సవితా బైరప్ప.. తన మీద కువెంపు మహా కవి ప్రభావం ఉందని చెబుతూ.. ఆయన ప్రకృతి, శాంతి ప్రియత్వం, ఎంతో గొప్పవి అంటూ పురాణేతిహాసాలలోని ఘట్టాలను ప్రస్తుత సమాజంలోని యుద్ధ ప్రీతి, యుద్ధ విధ్వంసాలు, స్వచ్ఛ తాగునీటి కొరత, స్త్రీ శక్తి వంటి విషయాల మీద దృష్టి పెట్టి ఈ రంగస్థల రచనకు, తాను తన ఆలోచనలను జోడించి, అనుభవం ఉన్న కళాకారులను ఎన్నుకొని, తానే కాస్ట్యూమ్ డిజైన్ చేసి, దర్శకత్వం వహించానని తెలిపారు.
ద్వాపర పురుషుడు, కలి స్త్రీ(గా)ని (ఇక్కడ దర్శకురాలు స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేసిన కలి పురుషుడితో జరిపిన సంవాదంలో ఆమె ఆధునిక స్త్రీవాద దృక్పథం మనకు కనిపిస్తుంది) ద్వాపరంలోని స్త్రీల జీవితం కంటే ఆధునిక కాలంలో స్త్రీ జీవితం మరింత క్లిష్టమైనదిగా ఉండబోతుందని, యుద్ధ విధ్వంసాత్మక వాతావరణంలో తన సృష్టి, సంతానాన్ని పరిరక్షించుకునే గురుతర కార్య భారాన్ని నిర్వహించబోతున్నందున తనను తక్కువగా అంచనా వేయొద్దంటుంది. నాటక ప్రారంభ దశ్యమే హిట్లర్ జాత్యహంకార ప్రసంగంతో ప్రారంభమై, అది నిన్న మొన్నటి ఆఫ్గాన్ ఉగ్రవాదం, ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం అశాంతి, జనహననం ప్రస్తావనలతో మొదలై 'శ్మశాన కురుక్షేత్ర' దృశ్యంతో ముందుకు నడుస్తుంది. స్టైలైజ్డ్ యాక్టింగ్, సంస్కృతి నిష్ట, కన్నడ భాషా ప్రయోగంతో, లయబద్ధంగా నడుస్తుంది ప్రదర్శన.
ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధక్షేత్ర దృశ్యాలను వివరించాడన్నదాన్ని సంకేతిస్తూ, సమాచార సాధనం (రేడియో/ ఆకాశవాణిని) పట్టుకొని ఉంటాడు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ప్రొడక్షన్ రిచ్‌గా కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ ఖర్చుకు వెనకాడలేదని కళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏ వస్తువునైనా రంగస్థలంపై సృజనాత్మక భావచైతన్యంతో కళారూపంలోకి అనువదించవచ్చునన్న 'ఆభాస' అడుగడుగునా కనిపిస్తుంది, ఈ నాటకంలో.
- ఆకుల మల్లేశ్వరరావు










