Jul 26,2023 22:15

-భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
-అర్ధరాత్రి తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం!
-రామాలయం రాజవీధుల్లోకి వరద
-కాటన్‌ బ్యారేజీ వద్ద 10.70 అడుగులు
-భయం గుప్పిట్లో ముంపు మండలాలు, లంక గ్రామాల ప్రజలు
ప్రజాశక్తి- యంత్రాంగం :వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి నది పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో, పోలవరం ముంపు మండలాల వాసులు, లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం నెమ్మదించిన వరద ప్రవాహం బుధవారం ఉదయం నుంచి క్రమంగా మళ్లీ పెరిగింది. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. భద్రాచలం వద్ద మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 43 అడుగులకు, రాత్రి తొమ్మిది గంటలకు 47.30 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, స్లూయిజ్‌ల నుంచి వచ్చిన వరద రామాలయం పరిసరాలను ముంచెత్తింది. ఆలయ రాజవీధులతోపాటు ఆవరణలోని విస్టా కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరింది. భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం-కూనవరం రహదారిపైనుంచి వరద ఉధృతంగా పారుతోంది. భద్రాచలం ఏజెన్సీలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10,83,434 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో ఉండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. దుమ్ముగూడెం, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బుధవారం అర్ధరాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 10.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో, ఈ బ్యారేజీ 175 గేట్ల ద్వారా 8,33,499 క్యూసెక్కుల నీటిని దిగువకు (సముద్రంలోకి), 6,900 క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు విడుదల చేస్తున్నారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో లంక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. మంగళవారం గోదావరి కాస్తా తగ్గడంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిలాల్లోని ముంపు మండలాల నిర్వాసితులు కొందరు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. గోదావరి మరోసారి పెరుగుతుండడంతో మళ్లీ పునరావాస కేంద్రాలకు, ఎతైన ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోన్న శబరి
వాగులో చిక్కుకున్న తెలంగాణ ఆర్‌టిసి బస్సు
చింతూరు వద్ద శబరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. క్రమంగా పెరుగుతూ బుధవారం సాయంత్రానికి 32 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, ఈ మండలంలోని సోకిలేరు, చంద్రవంక, కొయగురు, చీకటి వాగు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొయగురు వాగు రోడ్డుపై ప్రవహించడంతో ఆంధ్రాఒడిశా రహదారులు స్తంభించాయి. సోకిలేరు వాగు ప్రవాహం వల్ల విఆర్‌.పురాంచింతూరు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. కొయగురు వాగు దాటుతున్న తెలంగాణ ఆర్‌టిసి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. స్థానికుల సహాయంతో దీనిని బయటకు తరలించారు. వరద ఉధృతి పెరగడంతో ఎటపాక మండలం మురుమూరుకు, భద్రాచలం-కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఇంకా ప్రమాద స్థాయిలో వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో ముంపు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు.
'పోలవరం'లో 22.467 మీటర్ల నీటిమట్టం
సీలేరు, ఇంద్రావతి, శబరి ఉపనదులతోపాటు పోలవరం ప్రాజెక్టు ఎగువన కొండవాగులు గోదావరిలో కలుస్తుండడంతో వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో, పోలవరం ప్రాజెక్టు నుండి 8,50,589 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన 31.940 మీటర్ల నీటిమట్టం, దిగువన 23.570 మీటర్లు, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 32.660 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 23.000 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో 22.467 మీటర్ల గోదావరి నీటిమట్టం ఉంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వింజరం-ముత్యాలంపాడు మధ్యగల పాల వాగు కాజ్‌వే పైకి వరద నీరు చేరడంతో వింజరం, ముత్యాలంపాడు, కౌండిన్యముక్తి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలు వరద భయంతో రావికుంట పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. కుక్కునూరు-దాచారం మధ్యగల గుండేటి వాగు కాజ్‌వే ముంపుతో ఇప్పటికే తొమ్మిది రోజులుగా 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద మళ్లీ పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆచంట మండలంలో లంక గ్రామాలకు పడవలపై రాకపోకలను నిలిపివేశారు. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీట మునగడంతో ఆ గ్రామానికి పడవలపై తప్ప మరో రవాణా మార్గం లేకుండాపోయింది.