Jul 17,2023 07:19

పాలిండ్లేమిటి ఇంత పెద్దగా వున్నాయి?
వేళ్లు వెడ్పు చేసి గట్టిగా పిసికాడు
బుళక్‌న నెత్తురొచ్చింది-
చీఛీ..

కళ్లేమిటి ఇంత విశాంగా వున్నాయి?
వేళ్లతో పొడిచి లోనికి తొంగిచూశాడు
తరతరా కష్టాలుబికాయ్
చీఛీ..

నడుమేమిటి నడివీధిలోకి వచ్చింది?
చేయి చాచి ఒక్క నొక్కు నొక్కాడు
పంక్చరైన లారీ టైర్‌లా..
పుసుక్కున ముడుచుకుపోయింది-
పొగరుగా నవ్వాడు !

ఏమిటో దాచిపెట్టావ్‌ ?
బొందు పట్టుకు సర్రున లాగేసాడు
మటన్‌ షాపులో తలకిందులుగా వేలాడదీసిన
మేకలా మే..మే.. అంది
గర్వంగా మీసం మెలేసాడు !

పైకొచ్చి చూశాడు.. పెదవి మాటునేముందో ?
సారముడిగి, పెచ్చులు దేలిన పచ్చని భూమిలా
నాలిక గిడసబారిపోయింది-
శభాష్‌ అంటూ తన భుజం తానే చరుచుకున్నాడు
కన్నీటితో నానిన చెంపల్లోకి
పొడుచుకొచ్చిన నాసిక చుట్టూ ఏమిటి ?
పొగచూరిన వంటింటి మసాలా జిడ్డు-
నీళ్లూరుతున్న నాలికతో పెదాలు తడుపుకున్నాడు

శరీరాన్ని చుట్టి వచ్చాడు
అయినా, సందేహం తీరలేదు
రెక్కలు విప్పినట్టు ఆ చెవి డొప్పలేమిటో ?
తాకీతాకగానే ప్రపంచం చెవులు చిల్లు పడేలా
ఓ స్వరం విరుచుకు పడింది
'యత్ర నార్యస్తు పూజ్యంతే' అని.

'గుడ్‌.. వెరీ గుడ్‌, ఎవ్రీథింగ్‌ ఈజ్‌ ఫైన్‌'

మగ సంతకం గీకేశాడు !
- దేశరాజు