Oct 15,2023 08:09

పిల్లలూ, మన దేశంలో ప్రతి ఏడాది అక్టోబరు 9 నుండి 15 వరకు పోస్టాఫీసు వారాత్సోవాలు నిర్వహించుకుంటాం. మరి ఈ రోజు ఆ విశేషాలు తెలుసుకుందామా !
శాస్త్ర, సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ ఆధునిక సమాజంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో.. క్షణాల్లో తెలిసిపోతోంది. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వార్తలు చేరిపోతున్నాయి. వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టా లాంటి యాప్‌లతో ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితో అయినా నేరుగా మాట్లాడేస్తున్నాం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికీ తపాలానే కమ్యూనికేషన్‌ సాధనం. మనుషులు దూరంగా ఉన్నా తమ బంధాన్ని, అనుబంధాన్ని ఒక ఉత్తరం ద్వారా కొనసాగించేవారు. మనీ ఆర్డర్‌ లాంటి సేవలతో ఎందరికో ఆర్థిక అవసరాలను సైతం తీర్చింది మన పోస్టాఫీసు.
1874వ సంవత్సరంలో అక్టోబర్‌ 9వ తేదీన యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ (యుపిఎన్‌) మొట్టమొదటిసారిగా ఏర్పడింది. జపాన్‌ రాజధాని టోక్యోలో 1969 సంవత్సరంలో యూపిఎన్‌ మొదటి సమావేశం జరిగింది. ప్రపంచంలో నలుమూలలకు, ప్రపంచంలోని చివరి వ్యక్తికి కూడా పోస్ట్‌ కార్డులు చేరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ ఏడాదే అక్టోబర్‌ 9వ తేదీన తొలిసారిగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రతిపాదనను భారతదేశం నుండి ఆనంద్‌ నరులా ఆమోదించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నారు.
ప్రపంచ దేశాలలో సమాచార వ్యవస్థగా నిలిచిన తపాలా శాఖ సేవలు ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది తమ ఉత్తరాల ద్వారా కోట్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసేవారు. అలాంటి వారి గొప్ప సేవల్ని స్మరించుకుంటూ వారి పేరిట పోస్టల్‌ స్టాంపులను పోస్టల్‌ శాఖ విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం వరల్డ్‌ పోస్ట్‌ డే సందర్భంగా ఒక థీమ్‌ అనుకుంటారు. వారం రోజుల పాటు తపాలా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పోస్టల్‌ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమాలు రూపొందిస్తారు.
ఒకప్పుడు ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో లక్షన్నరకు పైగా తపాలా కార్యాలయాలు మన దేశంలోనే ఉన్నాయి. వీటిలో దాదాపు 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 23 వేల లోపే ఉన్నాయి.