కలలు వికసించే స్వేచ్ఛా తీరాల్లో
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో
ముంపులో కొట్టుకుపోతున్న పోలవరం నిర్వాసితుల కథ
భూమి కోసం, అటవీ హక్కుల కోసం పోరాడుతున్న అడవిబిడ్డల గాథ
గిరిజనులు...
చెల్లాచెదురుగా ఉన్న ఆత్మలు, మనుగడ కోసం ఆరాటపడుతున్న బతుకులు
వారి హృదయాలు గోదావరితోనూ, అడవితోనూ పెనవేసుకున్న జ్ఞాపకాలు
కట్టెలు, తేనె, వెదురు, అడవి కూరగాయలు, పుట్టగొడుగులతో
అమ్మలా ఆదుకుని బువ్వెట్టిన అడవి తల్లికి దూరమై..
ఆత్మలేని మనుషుల్లా... సమీప పొలాల్లోకి నెట్టబడిన వ్యవసాయ కూలీలు వీరు
పోలవరం, వారి సిరల్లో ప్రతిధ్వనించే పేరు
అడవీ, వారి నరనరాన జీర్ణించుకున్న ఊరు
మూలాలు, వారసత్వం, ప్రేమ ఇక్కడ మిగిలిపోయింది
వసతుల్లేని లోతట్టు కాలనీల్లోకి నెట్టినా...
న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం
అక్కడే మిగిలిపోయిన దశాబ్దాల నాటి హక్కుల కోసం
వారి ఆత్మల కోసం ఇంకా పోరాడుతూనే వున్నారు !
గోదావరి పరవళ్లను, అడవితల్లి వ్యథలను చిన్ననాటి కథలను
గుర్తు చేసుకుంటూ పిడికిలి బిగించు... గొంతెత్తి గర్జించు...
గలగలపారే ప్రశాంత గోదావరిలా కాదు
ఉవ్వెత్తున ఎగసిపడే వరదగోదావరిలా మారు...
నిర్వాసిత నేస్తల్లారా ...
ఎర్రజెండా అండగా కదిలింది పోరుయాత్ర
ఒక్క అడుగుతో మొదలై వేలాదిగా విస్తరిస్తూ సాగింది పాదయాత్ర
వేల అడుగులు ఒక్క దిశగా సాగుతున్న పోలవరం మహాయాత్ర
హక్కుల కోసం జగన్నాథ రథచక్రాలై కదిలింది పోరుయాత్ర !
నువు కలలుగన్న భూమి కోసం, హక్కుల కోసం
నువు కట్టుకున్న జ్ఞాపకాల పొదరింటి కోసం, అల్లుకున్న అనుబంధాల కోసం
నీకోసం కదిలింది పోరుకేక... పోలవరం ఆలింగనం కోసం
ఈ పోరాటం నీకోసం నాకోసం... రేపటి మన బిడ్డల కోసం
కదిలిరా సోదరా... దండుకట్టి సాగుదాం...
పోలవరం నిర్వాసితులకు అండగా నిలుద్దాం...
అరుణారుణ తొలిపొద్దులో ఎర్రమందారాలై వెలుగుదాం !
- రాజాబాబు కంచర్ల










