- హమాలీ కార్మికుల ఫెడరేషన్ రాష్ట్ర సదస్సులో నాయకుల డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : హమాలీ జట్టు, ముఠా, కళాసీ కార్మికులకు పని భద్రత కల్పించాలని హమాలీ కార్మికుల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బుధవారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. తొలుత మణిపూర్‌లో మతోన్మాద దాడులకు బలైన ఆదివాసీలకు, ప్రకాశం జిల్లా టంగుటూరు అంగన్‌వాడీ హనుమాయమ్మకి ఈ సదస్సు సంతాపం ప్రకటించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐదు లక్షల మంది ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్ పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. చట్ట అమలకు వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు, సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక చట్టాల అమలు కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కార్మిక చట్టాలను వామపక్ష ప్రభుత్వాలు అమలు చేశాయని తెలిపారు. వలస కార్మికుల రక్షణ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయాలని పేర్కొన్నారు. అధికారుల వేధింపులు, అధిక జరిమానాలు, అక్రమ కేసులతో హమాలీలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి సెస్ వసూలు చేయాలని కోరారు. హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆగస్టు 9న చేపట్టనున్న బిజెపి హఠావో, దేశ్‌కా బచావో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఎం. సీతారాములు అధ్యక్షతన జరిగిన . ఈ సదస్సులో ఫెడరేషన్ నాయకులు కాలం సుబ్బారావు, ఎ.గోపాల్, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










