ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన సమస్యల పరిష్కారం కోసం పిఎసిఎస్ ఉద్యోగులు చేస్తున్న ఉమ్మడి పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో 50శాతం వాటాలను ప్రైవేటీకరించడాన్ని, రైతు భరోసా కేంద్రాలను పిఎసిఎస్‌ల్లో విలీనం చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల చేతుల్లో ఉన్న సంఘాలను ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 1964 సహకార సంఘాల చట్టానికి చేసిన సవరణలను ఉద్యోగులు కోరుతున్న విధంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఏప్రిల్ 1 నుంచి చేయాల్సిన వేతన సవరణ ఇంతవరకు టిడిపి, వైసిపి ప్రభుత్వాలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం పూనుకొని 2014, 2019 నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణలను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ఆర్థిక కోర్కెలను కూడా పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు జరిగే ఐక్య పోరాటానికి మద్దతుగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న చలో విజయవాడకు ఐక్యవేదిక పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా నిలవాలని అన్ని కార్మిక, రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.










