Nov 15,2022 20:41

ప్రజాశక్తి - అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రాంతీయ సమావేశం స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక, కర్షక నిలయంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నర్సింగరావు మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందన్నారు. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయాన్ని విడిచి పట్టణాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కేంద్రం కట్టబెడుతుండడంతో నేడు అదానీ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో రెండో స్థానానికి ఎగబాకారని గుర్తు చేశారు. మరోవైపు దేశ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. కులం, మతం పేరుతో పాలకులు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బిజెపి వినాశకర విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని కోరారు. సమావేశంలో సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు బేబీ రాణి, రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి, విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, నాయకులు కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.