Dec 31,2022 11:20

ప్రజాశక్తి-సామర్లకోట (కాకినాడ) : యావత్‌ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక హక్కులను సాధించుకునేందుకు కృషి చేసే ఏకైక సంఘం సిఐటియు నే అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌ నరసింగరావు అన్నారు. భీమవరంలో ఈనెల 2,3,4 తేదీల లో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార జాత శనివారం స్థానిక విగేశ్వర థియేటర్‌ వద్దకు చేరుకుంది. ఈ ప్రచార యాత్రకు సామర్లకోట సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు మాట్లాడుతూ ... యావత్‌ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేందుకే సిఐటియు మహాసభలు జరుగుతున్నాయని కార్మిక పోరాటాల ద్వారానే ఏ హక్కులనైనా సాధించుకోగలమని అన్నారు. శ్రీ శ్రీ చెప్పినట్టుగా గనిలో, వనిలో, కాలేజీలో, కార్ఖానాలో ఎక్కడ పనిచేసిన కార్మికులేనని శ్రమ చేసినవారందరిని ఐక్యం చేసే పని సిఐటియు ది అన్నారు. వ్యవసాయ, కార్ఖానాలలో పనిచేసే కార్మిక అన్ని తరగతుల సంక్షేమం సాధ్యం కావాలంటే కార్మిక కర్షక ఐక్యత ముఖ్యమని అన్నారు. కార్మికుల ఐక్యతకు ప్రాధాన్యత ఈ మహాసభల్లో చర్చించి ఉద్యమాలను రూపొందించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిని నెలకొల్పాల్సిందిపోయి ఉన్న ఉపాధిని తీసేసే విధంగా వ్యవహరిస్తున్నాయని దీనితో రాష్ట్రంలో ఉన్న అనేక కంపెనీలు మూతపడడం దీనికి నిదర్శనం అని వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, ఇతర రాష్ట్రాల్లోని వివిధ చిన్న పరిశ్రమలను నిర్వీర్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో రియల్‌ ఎస్టేట్‌ చేయడానికి చూస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలందరూ ఐక్యతమై ఉద్యమాలకు ఊపిరి పోసి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చెక్కల రాజకుమార్‌ మాట్లాడుతూ ... పరిశ్రమల మూత దిశగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆదాయం తగ్గుతుందని నేపథంతో సామర్లకోటలోని షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగిందని దీనివల్ల 3000 మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు దానిపైన ఆధారపడి ఉన్న వేలాదిమంది చెరకు రైతులు నష్టపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కనీసం పరిశ్రమలు మూతపడుతుంటే పట్టించుకున్న పాపానపోకపోవడం దారుణమని అన్నారు. లాభాలు తక్కువగా ఉన్నాయని మూసివేస్తున్న కంపెనీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అనేక పరిశ్రమలలోని పర్యవేక్షణ లోపాలు కొరవడంతో ప్రమాదాలు నిరంతరం జరుగుతున్నాయని అనేకమంది కార్మికుల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. తక్షణం పరిశ్రమలలో కార్మిక చట్టాలను అమలు చేసి కార్మికులకు రక్షణ కల్పించడంతోపాటు పరిశ్రమలలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలపాటు తెలుగుదేశం హయాంలో ఉన్న ఇసుక ర్యాంపులను వైసిపి చేజెక్కించుకునేందుకు మూడు నెలలపాటు ఇసుకను ప్రజలకు అందనీయకుండా చేసిందని దీనితో తాపీ, ప్లంబర్‌, పెయింటర్‌, వడ్రంగి వంటి అనేక రంగాలకు చెందిన కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని కేవలం లాభార్జన దేంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని దీనివల్ల అనేకమంది కార్మికులు ఉపాధి లేక ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించకుండా అప్పులు చేసి పథకాలను అమలు చేసి దాని నుండి బయటపడేందుకు తిరిగి ప్రజలపైనే వివిధ రూపాలలో పన్నులు వేసి డబ్బు వసూలు చేయడంతో పేద ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణం జగన్మోహన్‌ రెడ్డి ఉపాధి కల్పనకు కృషిచేసి పన్నులు పెంచే పనిని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి , హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు విప్పర్తి కొండలరావు, సిఐటియు కాకినాడ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌, సిఐటియు కాకినాడ జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యుడు నరవ సురేష్‌ కుమార్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్‌ రావు, సిఐటియు నాయకులు ప్రకృతి ఈశ్వరరావు, కరణం గోవిందరాజు, వరలక్ష్మి, టీ.నాగమణి, ఎస్తేరు రాణి, బి.ఆదినారాయణ, సతీష్‌ అధిక సంఖ్యలో సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.