న్యూఢిల్లీ : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశాలను సుప్రీంకోర్టులో రిట్‌ను కోరేందుకు ఉపయోగించల ేమని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వాదనల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
'రాజకీయ పార్టీలను ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావడానికి మాండమస్ (అధికారిక విధులను నిర్వహించడానికి ప్రభుత్వానికి న్యాయపరమైన ఆదేశాలు) కోరడానికి సిఐసి ఉత్తర్వు ఉపయోగించబడదు' అని కోర్టుకు తెలిపారు.
అభ్యంతరం లేదన్న సిపిఎం
మరో వైపు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్‌టిఐపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిపిఎం తరఫున న్యాయవాది పివి దినేష్ తెలిపారు. అయితే, అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో మాత్రం చెప్పడం సాధ్యం కాదన్నారు. అది పార్టీ అంతర్గత నిర్ణయాల ప్రక్రియకు సంబంధించిన విషమన్నారు. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు, భూములు పొందడం తదితర ప్రయోజనాలను పొందుతున్న రాజకీయ పార్టీలను ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావాలని 2013లో సిఐసి ఉత్తర్వులు జారీ చేసిందని పిటీషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు.
ఎన్‌జిఒ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), న్యాయవాది అశ్విని ఉపాధ్యారు వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై విచారణను ఆగస్టు ఒకటో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కేసు వ్యవహారాలను చూసుకుంటున్నారని, ఆయన అందుబాటులో లేరని సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందుకు తీసుకురాగా.. పరిగణలోకి తీసుకుంటూ వాయిదా వేసింది.
రాజకీయ పార్టీలు ఏమంటున్నాయంటే..?
అయితే, రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తే రాజకీయాలకు సంబంధించిన అత్యంత గోప్యమైన అంశాలను కూడా వెల్లడించాల్సి వస్తుందని, దాంతో తమ పార్టీల మనుగడకు, రాజకీయానికి ప్రమాదం వస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. పార్టీకి అందే విరాళాలు, నిధుల సేకరణ, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తున్నామని, ఇదే సమాచారాన్ని అడిగితే ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పలు పార్టీలు పేర్కొంటున్నాయి. పార్టీలు చేసే రాజకీయాలను ఇతర వ్యక్తులతో పంచుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నాయి.










