Aug 23,2023 08:15
  • 'ఒక దేశం-ఒకే ఎరువు' సర్క్యులర్‌పై ఎఐకెఎస్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ : ఎరువుల సంచులపై రాజకీయ ప్రచారం చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎఐకెఎస్‌ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి భారతీయ జనుర్వరక్‌ పరియోజన్‌ అనే పథకం ద్వారా 'ఒక దేశం- ఒకే ఎరువు' అమలు చేస్తామని ఇటీవల కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్కులర్‌పై ఎఐకెఎస్‌ మండిపడింది. ప్రతి ఎరువు బస్తాపై మోడీ ఫోటో, పేరు ముద్రించడాన్ని తప్పుపట్టింది. ఈ పథకం పేరు కూడా బిజెపి పేరును గుర్తు చేసే విధంగా ఉందని విమర్శించింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖజానాను రాజకీయ ప్రచారానికి ఉపయోగించు కునేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని పేర్కొంది. ఈ మేరకు ఎఐకెఎస్‌ అధ్యక్ష, కార్యదర్శలు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి అవకాశాన్ని తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవాలనే పట్టుదలతో అధికార బిజెపి ఉందని ప్రకటనలో విమర్శించారు. కోవిడ్‌ టీకా ధ్రువపత్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడిన ఆహార ధాన్యాల ప్యాకెట్లపై మోడీ ఫోటోలను ముద్రించడాన్ని ఎఐకెఎస్‌ గుర్తు చేసింది. ఎరువుల సబ్సిడీ వ్యవస్థ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సృష్టించినది కాదనీ, 1970 నుంచి ఇది ఉనికిలో ఉందని తెలిపింది. అయినా ప్రతీ బస్తాపై తన ఫోటో, పేరు ముద్రించుకోవడం ద్వారా మోడీ తాను చేయని పనికి క్రెడిట్‌ తీసుకుని సెల్ఫ్‌ ప్రమోషన్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారని ప్రకటన విమర్శించింది. నిజానికి 'ఒక దేశం-ఒకే ఎరువు' అనే భావనే పూర్తిగా అసంబద్ధమైనదని, దేశంలో వివిధ ప్రాంతాల్లో నేలలు, అవసరాలు, పంటలను బట్టి రకరకాల ఎరువులు అవసరమవుతాయని తెలిపింది. అలాగే పథకంతో దేశంలో వ్యవసాయరంగంలో క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర మంత్రితత్వ శాఖ దీనిని తీసుకొచ్చిందని ఎఐకెఎస్‌ విమర్శించింది. ప్రస్తుతం ఎక్కువ శాతం ఎరువులు ప్రైవేటు కంపెనీల ద్వారా ఉత్పత్తి కావడమో లేక దిగుమతి చేసుకోవడమో జరుగుతోందని, ఈ ప్రైవేటు సంస్థలను మోడీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రచారానికి వాహనంగా ఉపయోగించుకో వాలనుకుంటుందని విమర్శించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఎరువుల ఉత్పత్తి, సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎఐకెఎస్‌ తెలిపింది. అశాస్త్రీయ పద్దతులను ప్రోత్సహించడం, దేశీయ ఉత్పత్తిని అణగదొక్కడం, ఎరువులను పెద్ద ఎత్తున బ్లాక్‌ మార్కెటింగ్‌కు అనుమతించడం వంటి కారణాలతో ఎరువుల సరఫరా తీవ్ర సంక్షోభంలో పడిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి భారతీయ జనుర్వరక్‌ పరియోజన్‌ వంటి పథకాలతో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణను కఠినంగా అమలు చేయాలని, రైతుల నుంచి కార్పొరేట్‌ కంపెనీల దోపిడీని అరికట్టాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది.