Apr 02,2023 09:50

మాస్కో : అమెరికా ప్రపంచాధిపత్యాన్ని అంతమొందించడమే లక్ష్యంగా రష్యా కొత్త విదేశాంగ విధానం రూపుదిద్దుకుంది. ఈ నూతన వర్షన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ఆమోదం తెలిపారు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించాలంటే ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందేనని ఆ పత్రం పేర్కొంది. నయా ఉదారవాద, వలస పాలకుల ఆధిపత్యవాదాన్ని తిప్పికొట్టేందుకు అనువైన పరిస్థితిని సృష్టించేందుకు రష్యా ఎల్లవేళలా కృషి చేస్తుందని ఆ పత్రంవ పేర్కొంది. రష్యా వ్యతిరేక విధానాన్ని దూకుడుగా ముందుకు తెచ్చేందుకు అమెరికా కుతంత్రాలు మీద కుతంత్రాలు పన్నుతోంది.పశ్చిమ దేశాలను కూడగడుతుండడంతో రష్యా భద్రతకు అది ముప్పుగా పరిణమించే అవకాశముందని రష్యా భావిస్తున్నది. ప్రపంచ శాంతి, సమతుల్యతతో కూడిన మానవాళి పురోగతికి అమెరికాయే పెద్ద ప్రమాదకారి అని విదేశాంగ విధాన పత్రం పేర్కొంది. అమెరికా తన బలవంతపు ఆధిపత్యాన్ని వదులుకుని, దాని రష్యా వ ్యతిరేక వైఖరిని మార్చుకోనంత కాలం ఆ దేశంతో సత్సంబంధాలకు ఆస్కారమే లేదని ఆ పత్రం స్పష్టం చేసింది. రష్యా-యూరప్‌ సంబంధాల సాధారణీకరణ గురించి ప్రస్తావిస్తూ, రష్యా, యూరప్‌ దేశాల ఆర్థిక పోటీతత్వాన్ని దెబ్బతీసి, యూరప్‌ దేశాల మధ్య చీలికలు తెచ్చి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యానికి ఎదురు లేకుండా చూసుకోవాలన్న వ్యూహంతో ఉందని ఆ పత్రం పేర్కొంది. 2016 నాటి వెర్షన్‌ స్థానే తీసుకొచ్చిన ఈ తాజా వెర్షన్‌ వెంటనే అమలులోకి వస్తుందని రష్యా తెలిపింది.