
- ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్, రెజ్లర్ సత్యవర్త్ కడియన్
- సాక్షిమాలిక్‌తో రెజ్లర్, బిజెపి నేత బబిత ఫోగట్ ట్విట్టర్ వార్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమ ఆందోళన రాజకీయ ప్రేరేపితం కాదని ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్, రెజ్లర్ సత్యవర్త్ కడియన్ స్పష్టం చేశారు. లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపితమంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలపై ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్, ఆమె భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియన్ మాట్లాడుతూ తమ నిరసన రాజకీయ ప్రేరేపితమైనది కాదని, రెజ్లర్లు ఐక్యంగా లేనందున వేధింపులను ఎదుర్కొన్నప్పటికీ ఏళ్లతరబడి మౌనంగా ఉన్నారని తెలిపారు. సత్యవర్త్ కడియన్ మాట్లాడుతూ ''మేము జనవరిలో (జంతర్ మంతర్‌కి) వచ్చాం. బిజెపి నాయకులు మాజీ రెజ్లర్ బబితా ఫోగట్, తీరత్ రాణా ఇక్కడ ఆందోళన చేసేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు'' అని గుర్తు చేశారు. ''ఇది కాంగ్రెస్ మద్దతుతో జరుపుతున్న నిరసన కాదు. 10-12 సంవత్సరాలుగా వేధింపులు, బెదిరింపులు కొనసాగుతున్నాయని 90 శాతం మందికి తెలుసు. కొంతమంది రెజ్లర్లు గొంతు పెంచాలని కోరుకున్నారు'' అని అన్నారు. తమ పోరాటం డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పైనే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని పునరుద్ఘాటించారు. మే 28న తమ పోరాటాన్ని పోలీసుల దౌర్జన్యం విచ్ఛిన్నం చేసిందని కడియన్ అన్నారు. పోలీసుల దౌర్జన్యంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. అనుమతి లేకుండా కొత్త పార్లమెంటు భవనం వైపు కవాతు చేయడంతో శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు రెజ్లర్లపై కేసు నమోదు చేశారు. ఖాప్ నాయకులు 'మహిళా సమ్మాన్ మహా పంచాయత్'కు పిలుపునిచ్చారని, తాము ఆ ఆందోళనలో పాల్గొనడంతో పోలీసుల క్రూరత్వాన్ని ఎదుర్కొన్నామని కడియన్ చెప్పారు. ''మేము (హరిద్వార్)లో పతకాలను గంగా నదిలో కలపాలని నిర్ణయించుకున్నాం. ఒక వ్యక్తి బజరంగ్ చేయి పట్టుకుని ఒక మూలకు తీసుకెళ్లి, చాలా మంది (ప్రభావవంతమైన)తో మాట్లాడేలా చేశారు. పతకాలను గంగానదిలో కలిపివుంటే హింస జరగవచ్చు. మేము కోచ్‌లు, తల్లిదండ్రులకు పతకాలు ఇచ్చాం' అని తెలిపారు. ''కుట్ర జరిగిందో లేదో అర్థం చేసుకునే స్థితిలో మేము లేము. ఆ సంఘటన తర్వాత, మా వైపు ఎవరు ఉన్నారో, వ్యవస్థలో భాగమైనవారు ఎవరో మాకు తెలియదు. చాలామందిని కలిశాం. ఎవరిని విశ్వసించాలో మాకు తెలియదు. కేంద్ర హోం మంత్రిని కలవమని సలహా ఇచ్చారు. మేము కలిశాం. తమపై ఖాప్ పంచాయతీలకు కోపం వచ్చిందని వస్తున్న పుకార్లు నమ్మొద్దు'' అని ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 11 నిమిషాల నిడివిగల వీడియో చివర్లో, సత్యవర్త్ కడియన్ ''మనం ఐక్యంగా లేనప్పుడు వ్యవస్థ ప్రయోజనం పొందుతుంది. మీరు ఏదైనా అన్యాయాన్ని ఎదుర్కొంటే, మీ గొంతు పెంచండి. ఐక్యంగా ఉండండి'' అని అన్నారు.
ఐక్యత లేనందునే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం : సాక్షి మాలిక్
రెజ్లర్లు ఐక్యంగా లేనందునే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని సాక్షి మాలిక్ తెలిపారు. ''మైనర్ తన ప్రకటనను ఉపసంహరించుకోవడం మీరు చూశారు. ఆమె కుటుంబం బెదిరిపోయింది. ఈ రెజ్లర్లు పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఒక శక్తివంతమైన వ్యక్తిని ఎదుర్కోవటానికి ధైర్యం చేయడం అంత సులభం కాదు'' అని అన్నారు.
బిజెపికి వత్తాసుగా బబిత ట్వీట్లు
బిజెపి నాయకురాలు, రెజ్లర్ బబితా ఫోగట్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. ''నాకు ప్రధానిపైనా, న్యాయ వ్యవస్థపైనా నమ్మకం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నా సహచరులపై నాకు ప్రేమ ఉంది. అందుకే ఈ విషయాన్ని మొదట ప్రధానమంత్రి, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించాను. వారు మాత్రం కాంగ్రెస్ నాయకులు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితుడైన దీపేందర్ హుడాలను ఆశ్రయించారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న ఆటని అందరికీ అర్థమవుతోంది'' అని అన్నారు.
స్వప్రయోజనాల కోసం హేళన చేయొద్దు : సాక్షి
బబిత వ్యాఖ్యలపై రెజ్లర్ సాక్షి మాలిక్ కౌంటర్ ఇచ్చారు. ''సహచరులంతా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీరు ప్రభుత్వం ఒడిలో చల్లగా సేదదీరుతున్నారు. మీ స్వప్రయోజనాల కోసం సహచరులకు ఎటువంటి సాయం చేయకపోగా ఇలా హేళన చేయడం సరికాదు'' అని అన్నారు.