- మణిపూర్ ఘటనలపై నిరసన ర్యాలీ అడ్డగింత
- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజుపై దాడి
ప్రజాశక్తి - టెక్కలి రూరల్ (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిఎస్‌పి బాలచంద్రారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. మణిపూర్‌లో మారణకాండను ఆపాలని, ప్రజలు, మహిళలకు రక్షణ కల్పించాలని, శాంతిని నెలకొల్పాలని టెక్కలిలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ కూడలి వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పోలీసులు శనివారం అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజు అనడంతో డిఎస్‌పి బాలచంద్రారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. రాజును బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి అక్కడ కొట్టారు. అనంతరం ఆయనను విడుదల చేశారు. మరోవైపు కళాశాలల యాజమాన్య ప్రతినిధులను స్టేషన్‌కు పిలిపించారు. ర్యాలీకి విద్యార్థులను ఎందుకు పంపించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపై దాడి ఘటనను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. దాడి ఘటనను ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఖండించాలని కోరారు.










