Jun 26,2023 07:23

అడవి తల్లి కొంగు బట్టి
అడుగు వేసి నడిచినట్టి
కాయా కష్టం తప్ప
మాయా మర్మమెరుగనట్టి
గిరిజనుడు.. ఇప్పుడు
పుట్టిన భూమికి పరజనుడు !
కన్నతల్లి వంటి ఊరు
కళ్ళముందే జల సమాధి !
తరతరాల అనుబంధం
తెగిపోతూ ఉన్నది
చేసిన త్యాగాలకు
ఇచ్చిన విలువేది?
నిరాశ్రయుల కన్నీరే
ఆ పనులకు పునాది
గిరిజనుడు ఇప్పుడు
పుట్టిన మట్టికే పరజనుడు!
ఈ కొండా కోనలకు
రాముడొచ్చినాడంటరు!
ఎంగిలి పళ్ళిచ్చిందని
శబరి కథను చెబుతుంటరు
కష్టాలు నష్టాలు
ఇక్కడనుభవిస్తుంటే
రామ జపం పాలకులు
కన్నెత్తైనా చూడరు
ఊరూరా పూసిన
మోదుగ పూలమ్మలారా!
పులులను వెంటాడిన
పూర్వపు విల్లమ్ములారా!
రేలారే రేలారే..
లేలేరే రారా రే..
పోరు జెండ పొలికేకకు
ఎరుపెక్కెను గోదారే!
 

- నల్లి ధర్మారావు