Aug 28,2023 07:42

'సమస్త మానవ కార్యకలాపాలకు, సమస్త సంపదలకు కృషియే కీలు చీల' అంటారు ప్రసిద్ధ కవి దువ్వూరి రామిరెడ్డి గారు. కృషి అంటే వ్యవసాయమే కాదు, శ్రమ కూడా. అటువంటి శ్రమను, శ్రమను నమ్ముకుని జీవిస్తున్న శ్రమ జీవులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? తమ అవసరాలు తీర్చే మనుషులను పట్టించు కోవాల్సిన బాధ్యత మనుషుల కు ఉండొద్దూ ?
శ్రీశ్రీ అన్నట్టు - గనిలో వనిలో కార్ఖానాలోనే కాదు, నిద్రలేని రాత్రులను, నిప్పులు చెరిగే ఎండలను లెక్క చేయకుండా తమ శరీరాలను పిండి, చెమటనే ఇంధనంతో సంపదలు సృష్టిస్తున్న కష్ట జీవుల, కార్మికుల, రైతుల పట్ల ఆ అట్టడుగు బడుగు జీవితాల పట్ల ఎవరికి నొప్పి ఉంటుంది? వారి వ్యథార్థ గాధల, యథార్థ పరిస్థితుల పట్ల ఎవరికి తీరిక ఉంటుంది? స్వార్థంలో మునకలేచే వారికి తీరిక ఉండదు కాని, మనిషితనం ఇంకిపోని హృదయానికి ఉంటుంది. హృదయమున్న మనిషికి ఉంటుంది.
స్పష్టమైన మార్కి ్సస్టు రాజకీయ దృక్పథంతో నడిచిన సామాజిక కార్యకర్త ఉన్నం వెంకటేశ్వర్లు. మార్కి ్సస్టు దృష్టితో తన రాజీకీయ ఆలోచనల్ని, చేతనత్వాన్ని తనదైన అవగాహనతో చదువుకున్న విద్యావంతుడు, దశాబ్దాలుగా సామాజిక బాధ్యతగల పత్రికా సంస్థలో పాత్రికేయ విద్యార్థులకు పాఠాలు బోధించిన అధ్యాపకుడు. ఉద్యమకారుడిగాను, ప్రజాస్వామ్యం పట్ల, సామ్యవాదం పట్ల అమితమైన గౌరవం ఉన్న పౌరుడిగానే కాదు, సామాజిక స్పృహ కలిగిన కవిగా, రచయితగా నిశిత పరిశీలనతో, నిఖార్సయిన దృష్టితో రాసిన కవిత్వమే 'కాలంపై కవాతు'.
వర్తమాన సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్ని, సామాజిక స్థితిగతులను సీరియస్‌గా పరిశీలిస్తూ, కార్పొరేట్‌ శక్తుల కాళ్ళ ముందు సాగిలపడుతున్న రాజకీయాలను, వాటి కుట్రపూరిత వ్యూహాల్లో బలవుతున్న సామాన్య ప్రజా జీవితపు కడగండ్లను, చుట్టూ జరుగుతున్న మానవ హక్కుల హననాన్ని, సాంస్క ృతిక విధ్వంసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ఒక్కోసారి నిరసనగా ఒక్కోసారి సెటైరికల్‌గా, ఒక్కోసారి తల్లడిల్లిపోయే మానవ హృదయంగా రాసిన కవితల్ని 'కాలంపై కవాతు' సంపుటిలో మనం గమనిస్తాం.
కవి వెంకటేశ్వర్లు అవగాహనలోంచి నేటి సమాజ స్థితికి అద్దంపట్టే కింది వాక్యాలను గమనిస్తే -
''వేషం ప్రపంచీకరణ
వాచకం సరళీకరణ
వాయిద్యం ప్రైవేటీకరణ
సారం వ్యక్తి సంపదీకరణ
రేపటి స్వర్గం మాటల్లో చూపుతూ
జనాన్ని బాధల బావుల్లో దింపుతూ
కుబేరులు సంపదతో ఎగబాకుతున్నారు
జనాలుఉన్నది కోల్పోయి దిగజారుతున్నారు
నిజం పెట్టుబడికే తెలుసు
కష్టం సంపద కనుమరుగు
చట్టం వాటిని చుట్టిన ముసుగు
ఇది అతి పెద్ద మోసాల కలుగు'' (నడుస్తున్న భారతం) అంటారు. అలతి అలతి మాటల్లో సూటిగా పొందుపరిచిన ఈ మాటల్లో మన చుట్టూ కమ్ముకున్న, అంతకంతకూ కబళిస్తున్న మోసపూరిత పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాదు; కాయకష్టం నమ్ముకున్న బడుగుల్ని తమ పెత్తందారులకు దోచిపెట్టే పన్నాగంలో పెద్దన్న పాత్రలు పోషిస్తున్న ప్రభుత్వాల్ని, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న పాలనా వ్యవస్థని, రాజ్యాంగ విలువలకు తిలోదకా లిస్తున్న దుస్థితిని నేటి నిజాలు అనే కవితలో
''రాజ్యాలు ఇప్పుడు/ కార్పొరేట్‌ భోజ్యాలు
జాతి జాతీయత వాటి చెప్పు కింద తేళ్ళు
కుల మత అహాలు లాభానికి దాసోహాలు
ప్రపంచమొక పాడిపశువైపితకాలి లాభాలు
అందుకే దేశ పొలిమేరలు చెరిపే వ్యాపారాలు'' అని అభిప్రాయపడతాడు. అంతేకాదు; ''నీ రెక్కల కష్టమే నీకు తోడంటాడు ఒకడు /నీకున్నదాంతో తృప్తి పడంటాడు ఇంకొకడు/ ఈ సంగతి ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు చెప్పండంటే ఒక్కడూ వినడే'' అంటూ చుట్టూ కమ్ముకున్న దోపిడీని, దోపిడినుంచి బయట పడాల్సిన ఎరుకను అందిస్తాడు. ముఖ్యంగా నేటి భారతీయ సమాజంలో జరుగుతున్న శ్రమదోపిడి, స్వేచ్ఛ లేమి, సాంస్క ృతిక విధ్వంసం వీటన్నిటి పర్యవ సానంగా పౌరులు రాజకీయ మాయమాటల చట్రంలో చిక్కుకున్న దుస్థితిని తెలియజేస్తాడు. కాలం ఆర్తిని, ఆవేదనను రికార్డు చేస్తారు.
ఈ సందర్భంలో 'కాలం గుండె చప్పుడే కవిత్వం' అన్న ప్రసిద్ధ కవి శివసాగర్‌ గారి మాటలు గుర్తుకు వస్తాయి. వీరి కవిత్వాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ కవి కవితాత్మక వ్యక్తీకరణ కోసం పాకులాడటం ఉండదు. సామాజిక స్ప ృహ, సంఘ చేతన ప్రధానంగా కనిపిస్తుంది. ప్రజల పక్షంగా నిలపబడటం, గొంతు విప్పటం ముఖ్య లక్షణంగా వీరి కవిత్వంలో వినిపిస్తుంది.
ఎంగిలాకు సవాల్‌, మెతుకు భారత యుద్ధం, రెక్కల కష్టం, మార్కెట్‌ మాయ, దేశ నిట్టాడులపై దాడి వంటి కవితలతోపాటు, స్త్రీలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా 'ఆయుధం కావడమే ఆమెకు భద్రత' వంటి కవితలను, జరుగుతున్న కుట్రపూరిత రాజకీయాల నుంచి విముక్తి కావడానికి అవసరమైన అవగాహన, చైతన్యాన్ని అందించే కవితల్ని ఈ కవితా సంపుటిలో మన మెదళ్లను కదుపుతాయి. హృదయాన్ని కుదుపుతాయి.
మానవ చైతన్యాన్ని గురించి ఆలోచించే ఎవరికైనా నడుస్తున్న కాలం అత్యంత దుర్మార్గపూరితమైన, విధ్వంసకరమైన
శ్రమదోపిడికి, వ్యక్తి స్వేచ్ఛ హననానికి గురికాబడిన, కాబడుతున్న కాలంగా కనిపిస్తుంది. ప్రజా రాజకీయాల నుంచి, కార్పొరేట్‌ రాజకీయాలుగా మారిన మానవ సమూహాల దేశాలు ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తాం. వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి, వీటన్నిటి నుంచి విముక్తి పొందటానికి ఏ కాలంలోనైనా మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆలోచనలు అత్యంత అవసరమైనవన్నది మనం మరిచి పోకూడదు. అయితే ప్రపంచ దేశాలన్నింటికి వర్తించే వర్గ దృక్పథం ఒక్కటే భారతీయ సమాజానికి సరిపోదన్నది కూడా వాస్తవం. ఇక్కడ వర్గం కంటే కులం చాలా బలమైంది. ఈ దృష్టిని కవి విస్మరించపోవడం అభినందనీయం. ఎక్కువగా శ్రమ దోపిడీ, ఆర్థిక అసమానతలపై గళాన్ని వినిపించడం స్పష్టమైన వారి మార్కి ్సస్టు దృక్పథాన్ని తెలిజేస్తుంది. అందుకే 'చీమల విముక్తి శాస్త్రం' అంటూ కథలాంటి పాఠాన్ని బోధిస్తాడు. కర్తవ్యాన్ని సూచిస్తాడు.
''నీ కండలు వండి పెట్టినా
నీ ఎముకల సూపు తాపినా
వాడి ధనం కడుపు నిండదు
ఎండిన నీ డొక్క దరిద్రం మారదు
ప్రశ్న భుజానేసుకుని.. పేదోడు
మురికి మూలం ఏమిటంటూ
వాడి ధనం పొట్ట చీలిస్తేనే
నీ కష్టం ఎగిరెళ్ళి వాడి
పొట్ట బోషాణంలో
ఎక్కడ దాగిందో తెలుస్తుంది
ప్రశ్నలు లేవకుండా
పరిష్కారాలు దొరకవు'' అని ఒక ఉత్తేజా న్నిచ్చి ప్రశ్నించాల్సిన తెగువను, ఉద్యమంలోకి నడవాల్సిన దారిని చూపెడతాడు.
''ప్రజల కవివై గొంతు/ రగిలించి పాడితే
బక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు
తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి
లోకాల నూగింపరా!
ఓ కవీ!, శోకాల తొలగింపరా!'' అని రాసిన తాపీ ధర్మారావు గారి చైతన్యపు దోవలో నడుస్తున్న కవికి శుభాభినందనలు.
''సంపద పెరుగుతున్నా పేదల కష్టాలు ఏ మాత్రం తగ్గటం లేదు అంటే ఈ సామాజిక వ్యవస్థ ఎక్కడో కుళ్లిపోతుందన్న మాటే'' అన్న మార్క్స్‌ వాక్యాలనే మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్న ఈ కవిత్వానికి స్వాగతం చెబుతూ... లాల్‌ సలాములు.
 

- పల్లిపట్టు నాగరాజు
99894 00881