
కవిగా, విమర్శకుడిగా, బోధకుడిగా, విద్యావేత్తగా బహుముఖీన ప్రతిభ చూపిస్తున్న సృజనశీలి డాక్టర్ సుంకర గోపాలయ్య. ఇటీవల రొట్టమాకు రేవు అవార్డు, శిఖామణి యువ సాహిత్య పురస్కారాలు పొందిన సందర్భంగా సంభాషణ ...
ఈ పురస్కారాలకు ఎంపిక కావటంపై మీ అనుభూతి ?
ఈ రెండూ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇవాళ మనం వేసిన కవితా సంపుటికి ఏదో ఒక అవార్డు రాకపోతే దాన్ని అస్సలు పట్టించుకోని స్థితిలో మనం ఉన్నాము.
ఆధునిక కవిత్వంలో మీకు ఎవరు స్ఫూర్తి ?
ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న సార్. నా అధ్యయనంలో భాగంగా నన్ను కదిలించిన, కుదిపిన కవిత ఎవరు రాసినా సరే వాళ్లని నేను అభిమానిస్తాను. గౌరవిస్తాను. అప్పటి శ్రీశ్రీ నుండి ఇప్పటివరకు పుస్తకం వేయని పైడికొండల వెంకటేష్ అనే కవి వరకు నేను స్ఫూర్తి పొందుతూనే ఉన్నాను. నన్ను కవిత్వం వైపు తీసుకెళ్లిన రాధేయ గారు, అనంతపురం నుండి వచ్చాక నెల్లూరు జిల్లాలో పెరుగు రామకృష్ణ గారు ఇచ్చిన ప్రోత్సాహం కూడా మరువలేనిది.
కవిత్వంలో జానపద శైలి మీకెలా అబ్బింది ?
మా నాయన వీధి భాగవతపు కళాకారుడు. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ఊరు తిరిగి భాగవతం ఆడటం మానేశాడు. కానీ అప్పుడప్పుడు రాత్రిపూట దక్ష యజ్ఞం, చెంచులక్ష్మి నాటకం, భైరావణవధ లాంటి వీధి బాగోతాల పాటలు పాడుతూ ఉండేవాడు. మధ్యాహ్నం పూట ఆయన దగ్గరికి చాలామంది వచ్చి కూర్చునే సందర్భాల్లో ఆయన రామాయణ భారత భాగవత ఘట్టాలు తనదైన శైలిలో చెప్పడం విన్నాను. పదిమందిని ఆకట్టుకునే శైలి ఆయన మాటల్లో గమనించాను. అలా అప్రయత్నంగానే జానపద శైలి వచ్చిందనుకుంటాను.
ప్రాచీన, ఆధునిక సాహిత్య అంశాల వక్తగా విస్తృత పర్యటనలు చేస్తున్న అనుభవం ఏం నేర్పుతుంది ?
తెలుగు సాహిత్యం చదువుకున్నవాడిగా ఎవరైనా ఒక అంశం మీద మాట్లాడమని అడిగితే, మాట్లాడతానని ఒప్పుకున్నాక తీవ్రమైన పరిశ్రమ చేస్తాను. కాకినాడలో మాట్లాడిన శల్య పర్వ ప్రసంగం, తాడేపల్లిగూడెంలో మాట్లాడిన మొల్ల రామాయణం నా పట్ల నాకు నమ్మకాన్ని పెంచాయి. ఆ ప్రసంగాలు విన్న సురతులు చాలా ఆనందించారు. అభినందించారు. గుంటూరులో మాట్లాడిన బసవపురాణం, కాకినాడలోనే ఈమధ్య మాట్లాడిన రాఘవ పాండవీయం కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ఆచార్య బేతవోలు గారి ప్రశంస కూడా లభించింది. అందువల్ల ప్రాచీనాన్ని, ఆధునికాన్ని రెండు కళ్ళగా భావిస్తూ, సాహిత్యం పట్ల ఆసక్తితో ఇష్టంతో కొనసాగుతున్నాను.
కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం ?
కవిత్వం నేను ఆత్మతో చేసుకునే సంభాషణ. నా లోపల జరిగే సంఘర్షణ. నా బతుకు దీపాన్ని ఎగదోస్తున్న అమ్మ చేయి. నాతో నడుస్తూ నడుపుతున్న నా సహచరి.
కవి, విమర్శకుడు ... ఈ రెంటిలో ఏది ప్రాధాన్యతాంశం మీకు ?
నేను అధ్యయనం చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఎవరైనా కవి నన్ను ప్రభావితం చేస్తే ఆ కవి గురించి నాదైనా ఆలోచనలోంచి నాదైన చూపులోంచి వ్యాసాలు రాస్తూ ఉన్నాను. ఆ వ్యాసాలు నన్ను విమర్శకుడిగా నిలబెడుతున్నాయి. ఆ క్రమంలో కవిత్వం, విమర్శ రెండూ కూడా నన్ను మెరుగుపరుస్తూ ఉన్నాయి. కానీ కవిత్వం సృజనాత్మక ప్రక్రియ. విమర్శ కంటే కూడా కవిత్వమే మనకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది.
సంభాషణ : డాక్టర్ పెరుగు రామకృష్ణ
98492 30443