- తగ్గనున్న తాండవ ఆయకట్టు
- రైవాడ జలాశయంపైనా ప్రతికూల ప్రభావం
- అదానీ, షిరిడీసాయి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ నివేదిక
ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేయతలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పిఎస్‌పి)లు స్థానిక నీటివనరులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నీటిపారుదల శాఖ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు రూపొందించిన సమగ్ర నివేదికను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. అదానీతో పాటు, షిరిడిసాయి సంస్థలు స్థానికంగా పిఎస్‌పిలను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపు ప్రతిపాదనలు కూడా దాదాపు సిద్ధమయ్యాయి. పాడేరు ఏజెన్సీలో ఐదో షెడ్యూల్ పరిధిలో ఉన్న చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ ప్రాజెక్టును శ్రీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు, అనంతగిరి మండలం పెదకోట, రైవాడ జలాశయం పైభాగంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఇజిఇఎల్)కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ జీవనోపాధిని ఈ ప్రాజెక్టులు దెబ్బతీస్తాయని స్థానిక గిరిజనులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించిన నివేదిక కీలకంగా మారింది. ఎర్రవరం వద్ద పిఎస్‌పి ఏర్పాటుచేస్తే ఆ ప్రాంతం నుంచి తాండవ జలాశయంలోకి రావాల్సిన నీటివనరులు గణనీయంగా తగ్గుతాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. దీని ప్రభావం ఆయకట్టుపై పడుతుందని, భవిష్యత్తులో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని వివరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఈ జలాశయం కింద సాగవుతున్నాయి, ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎంతకు పరిమితం కానుంది తదితర వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతగిరి మండలం పెదకోట వద్ద ప్రతిపాదించిన అదానీ ఆయకట్లు వల్ల రైవాడ జలాశయ పరిధిలో కూడా ఇదే పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నట్లు తెలిసింది.
జలాశయానికి నీటిని చేర్చే వనరులు దెబ్బతింటాయని, ఫలితంగా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో నీరు చేరే పరిస్థితి ఉండదని వివరించినట్లు తెలిసింది. ఫలితంగా సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
అధికారులపై ఒత్తిళ్లు...?
నివేదికలో పేర్కొన్న అంశాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉండటంతో వాటిని మార్చి కొత్త నివేదికను రూపొందించి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. జలగండం తప్పదంటూ రూపొందించిన నివేదికను అధికారులు సుమారు నెలరోజుల కిందటే ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. నివేదికలోని కీలక అంశాలు వ్యతిరేకంగా ఉండటంతో వాటిని మార్చి తీరాలని ఆదేశిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారుల్లో కొద్దిరోజులుగా మల్లగుల్లాలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే అదానీ అక్రమాలు వెలుగులోకి రావడం, దేశ వ్యాప్తంగా కలకలం రేగడంతో ఒత్తిడి కొంత మేరకు తగ్గిందని చెబుతున్నారు. నిజానికి ప్రస్తుత నివేదిక రూపొందండం వెనుక కూడా పైనుండి వచ్చిన ఒత్తిడి కారణమేనని సమాచారం. ఈ ప్రాంతంలో పిఎస్‌పిలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కచ్చితంగా ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎంత సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తారన్న వివరాలు నీటిపారుదల శాఖ అధికారులకు అందలేదు, ఆ వివరాలు లేకుండా నివేదిక తయారు చేయడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి తెలియచేశారు. అయితే, సాధ్యమైనంత త్వరగా వీటి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో నివేదికకోసం పై నుండి ఒత్తిడి వచినట్లు తెలిసింది. దీంతో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమ అభిప్రాయాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందచేశారు. ఇదే విషయమై ఒక ఉన్నతాధికారి ప్రజాశక్తితో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పిఎస్‌పిల ఫీజిబులిటీ సర్టిఫికెట్‌ను రూపొందించి, సమర్పించినట్లు చెప్పారు.










