Nov 11,2023 09:23
  • బిల్లులను నిరవధికంగా తొక్కిపెట్టే అధికారం ఎవరిచ్చారు ?
  • గవర్నర్ల తీరుపై సుప్రీం సీరియస్‌
  • 20కి విచారణ వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిప్పుతో చెలగాటమాడొద్దని గవర్నర్లను సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. బిల్లులను దీర్ఘకాలం పాటు తొక్కిపడుతున్న తమిళనాడు, కేరళ, పంజాబ్‌ గవర్నర్లకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం తిరిగి విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గవర్నర్ల తీరుపై సీరియస్‌ అయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో జాప్యం ఎంతమాత్రమూ అనుమతించరానిదని పేర్కొంది. బిల్లులపై గవర్నర్ల చర్య తీవ్రమైన ఆందోళనకలిగిస్తోందంటూ, పెండింగ్‌ బిల్లులపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు సుప్రీం ఆదేశించింది. ''మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాజ్యాంగవిరుద్ధమని గవర్నర్‌ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. పంజాబ్‌లో గవర్నర్‌, ప్రభుత్వం మధ్య జరుగుతున్న పరిణామాలపై మేము సంతృప్తికరంగా లేము. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని కొనసాగిస్తామా?. ఇది చాలా తీవ్రమైన విషయం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారత్‌ సుస్థిరమైన సంప్రదాయాల ఆధారంగా నడుస్తోంది, వాటిని నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
          తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 12 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించిన ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రం లేవనెత్తిన అంశాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని, ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌కు 12 బిల్లులు పంపిస్తే ఒక్కదానిపై కూడా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ల సహాయాన్ని కూడా కోర్టు కోరింది.
 

                                               గవర్నర్ల ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధం : అభిషేక్‌ మను సింఘ్వీ

పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాల తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ మాట్లాడుతూ.. బిల్లులపై చర్య తీసుకోవడానికి గవర్నర్లు నిరాకరించే ధోరణి ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తోందని మిగతా 5లో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్ల సమస్య పంజాబ్‌ నుంచి తమిళనాడుకు, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారికి విస్తరిస్తోన్న వ్యాధి అని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధమని, ఆయన చర్య ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ''దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ సంతకం చేయటం లేదు. రిమిషన్‌ ఆర్డర్‌లకు సంబంధించిన బిల్లుపై కూడా సంతకం చేయడం లేదు. ప్రాసిక్యూషన్‌ లేదా రిమిషన్‌ కోసం శాంక్షన్‌ ఇవ్వాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము అనే లేఖ ఇక్కడ ఉంది. జైలులో ప్రజలు ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి'' అని సింఘ్వీ అన్నారు. సింఘ్వీతో పాటు తమిళనాడు తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, పి. విల్సన్‌ కూడా హాజరయ్యారు. అనంతరం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ తీసుకున్న చర్యల వివరాలను తమకు అందజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోర్టు ఆదేశించింది. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య, పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ పురోహిత్‌ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు తలెత్తాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఈ నెల 6న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్లకు ఆత్మపరిశీలన అవసరమని వ్యాఖ్యానించింది. కేరళ దాఖలు చేసిన పిటిషన్లను కూడా ఈ నెల 20న విచారించనుంది.