
వివినాయకచవితి సందర్భంగా ఓ నాటకం వేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా సాగుతున్న నాటకాన్ని వీక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వారిలో 10 ఏళ్ల రాము కూడా ఉన్నాడు. ఆ రోజు రాత్రి నాటిక చూసి ఇంటికి వచ్చి పడుకున్నాడు.
నిద్రలో అతనికి ఓ కల వచ్చింది. 'రామూ.. నేను ప్లాస్టిక్ భూతాన్ని. నాటికలో నన్ను చంపేశారని సంబరపడుతున్నావా? అది నాటిక. నిజంగా నేను చావలేదు. ఇప్పుడొచ్చేది పండుగ కాలం. చాలా అట్టహాసంగా వేడుకలు చేసుకుంటారు. టపాసులు కాలుస్తారు. ఈ కార్యక్రమాలన్నీ నేను లేకుండా ఏం జరగవు. నన్ను మీరు ఏవిధంగానూ హతమార్చలేరు. భూమిలో పాతి పెడితే, వర్షం నీరు ఇంకనీయకుండా చేసి, నన్ను పాతిన చోట కనీసం ఒక మొక్కను కూడా మొలవనివ్వకుండా కరువు సృష్టిస్తాను. కాల్చి బూడిద చేస్తామంటారా? విషవాయువులు వ్యాపింపజేసి మిమ్మల్ని అంతమొందిస్తాను. నన్ను పెంచేది మీరే, మీ అండతోనే మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి వచ్చాను.' అంటూ ఓ తెల్లని ఆకారం రాముతో మాట్లాడుతుంది.
తెల్లవారగానే రాము తనకు వచ్చిన కల గురించి ఇంట్లో చెప్పాడు. ఇకపై ఇంట్లో ఎవరూ ప్లాస్టిక్ వాడవద్దని, గుడ్డలతో చేసినవి, నార సంచులనే వాడమని చెప్పాడు. ప్రకృతి సహజసిద్ధ వస్తువులతోనే పండుగలన్నీ చేసుకుందాం అన్నాడు. ఆ రోజు స్కూలుకు వెళ్లి స్నేహితులతో కూడా అదే మాట చెప్పాడు. ఆ రోజు నుంచి రాము, స్నేహితులు వారి ఇళ్లల్లో, స్కూల్లో ప్లాస్టిక్ వాడడం తగ్గించేశారు.
అప్పుడు ప్లాస్టిక్ భూతం నిజంగానే నిరుత్సాహపడి, నీరసించి పోయి ఉంటుంది. కదూ?
- ద్వారపురెడ్డి జయరాం నాయుడు