
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : రీ సర్వేపై పూర్తి అవగాహన కలిగి, ఒక ప్రణాళిక బద్ధంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌రామ్ సుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలకు సంబంధించిన రెవిన్యూ అధికారులకు నిర్వహించిన ఒక రోజు అవగాహన సదస్సులో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేలో భాగస్వాములు అయిన వారందరూ కలిసికట్టుగా పని చేసినట్లయితే మంచి నాణ్యమైన రీ సర్వే జరుగుతుందన్నారు. రీ సర్వే కార్యక్రమంపై మొదటి నుండి ఖచ్చితమైన ప్రొసీజర్ కలిగి ఉండాలన్నారు. ప్రతి రైతుకు రీ సర్వే గురించి తెలియ చేసి నిబంధన ప్రకారం చేయాలని సూచించారు. రీ సర్వేలో రైతులు భాగస్వాములుగా ఉండాలన్నారు. వారికి నోటీసులు కూడా అందజేయాలని, వారికి ఎంత అవగాహన కలిగి ఉంటే అంత బాగా రీ సర్వే జరుగుతుందన్నారు. రీ సర్వేపై అవగాహన పెంచుకొని తప్పులు లేకుండా నాణ్యమైన రీ సర్వే చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూములకు గతంలో ఉన్న సరిహద్దులు మాత్రమే తీసుకోవాలన్నారు. పట్టా భూమి ఎవరైతే ఎంజాయ్మెంట్ లో ఉన్నారో సరిచూసుకోవాలన్నారు. రీ సర్వేలో సులువైన పద్ధతులను పాటించి మంచి రిజల్ట్ తీసుకురావాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి కె జాషువా, తహశీల్దార్లు సి హెచ్ పెద్దిరాజు, ఆర్‌వి కృష్ణారావు, యం సునీల్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎమ్మార్పీ బాబు, మండల సర్వేలు, గ్రామ సెక్రటరీలు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.