Oct 26,2022 10:35
  • ఏడు డ్రెయిన్లపై అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లకు నూతన డిజైన్లు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లాలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో పొలాల ముంపు నివారణకు ప్రణాళిక సిద్ధమైంది. ఏడు డ్రైయిన్లపై అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల నిర్మాణానికి నూతన డిజైన్లను అధికారులు రూపొందించారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అంచనాలు తయారు చేసి పనులను ప్రారంభించనున్నారు. డ్రెయిన్లు, సాగునీటి కాల్వల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఏటా నష్టపోతున్నారు. డ్రెయిన్లకు మరమ్మతులు చేయని కారణంగా వేలాది ఎకరాల వరి పొలాలు గత కొన్నేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 3,200 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ రెండు మండలాల్లో పంట పొలాలు ముంపు బారిన పడకుండా వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తరలించడానికి డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. ఇరాలి, రత్నకోడు, కోడూరు మైనర్‌, పిట్టల్లంక డ్రెయిన్‌, మంగలేరు, ఉప్పు కాలువ, మేకాల కాలువ డ్రెయిన్‌ తదితర డ్రెయిన్లు భారీ వర్షపు నీటిని సైతం కొద్ది సమయంలోనే తరలించేందుకు వీలుగా వందల కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్నాయి. సముద్రపు పోటు నీరు డ్రెయిన్లలోకి రాకుండా అడ్డుకునేందుకు, ఎగువ నుంచి వచ్చే మురుగు నీటిని సముద్రంలోకి పంపేందుకు వీలుగా ఈ డ్రెయిన్ల అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు నిర్మితమై ఉన్నాయి. వీటికున్న గేట్లు సముద్రపు నీరు ఎగువకు చొచ్చుకు వచ్చే (పోటు) సమయంలో మూసుకుపోతాయి. సముద్రపు నీరు లోపలకు వెళ్లే (ఆటు) సమయంలో డ్రెయిన్లలోని నీరు లోపలకు వెళ్లడానికి వీలుగా గేట్లు ఏర్పాటు చేశారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ షట్టర్లు పని చేయకపోవడం, స్లూయిజులు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు. దీంతో, వీటి పరిధిలోని 16 వేల ఎకరాలను ముంపు సమస్య వేధిస్తోంది.
 

                                                                          తాజా డిజైన్లు ఇలా

ఇరాలి డ్రెయిన్‌పై పాలకాయతిప్ప వద్ద, రత్నకోడు డ్రెయిన్‌పై సంగమేశ్వరం వద్ద, మైనర్‌ డ్రెయిన్‌పై కోడూరు వద్ద, పిట్టల్లంక డ్రెయిన్‌పై పిట్టల్లంక వద్ద, మంగలేరు, ఉప్పు కాలువ డ్రెయిన్‌పై రెండు చోట్ల నాలి వద్ద, మేకల కాలువ డ్రెయిన్‌పై పెదకమ్మవారిపాలెం వద్ద నూతనంగా స్లూయిజుల ఏర్పాటుకు అధికారులు డిజైన్లు రూపొందించారు.
 

                                                                డిజైన్లు ప్రభుత్వానికి పంపాం

దివిసీమలోని ఏడు డ్రెయిన్లపై అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు నిర్మించాలి. ఎత్తు, వెడల్పు, నీటి ప్రవాహ సామర్థ్యం తదితర వివరాలతో డిజైన్లు ప్రభుత్వానికి పంపాం.
                           -శ్రీనివాస్‌, కృష్ణా జిల్లా డ్రెయినేజీ ఇఇ