Oct 07,2022 11:21
  • జగనన్న లేఅవుట్లలో కానరాని రోడ్లు
  • ప్రతిపాదనల దశలోనే విద్యుత్‌, తాగునీరు వసతులు
  • ఇల్లు నిర్మించుకున్నా వసతుల్లేక లబ్ధిదారుల అవస్థలు

ప్రజాశక్తి - కాళ్ల : పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. వారికి కేటాయించిన జగనన్న లేఅవుట్‌లలో సౌకర్యాలు లేక.. ఇల్లు నిర్మించుకోలేక కొందరు... అష్టకష్టాలు పడి ఇల్లు నిర్మించుకున్నా రోడ్డు సౌకర్యమూ లేక మరికొందరు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరుపాడులో రెండు జగనన్న లేఅవుట్‌లు ఉన్నాయి. ఆ లేఅవుట్‌లలో రహదారులతోపాటు విద్యుత్‌, నీటి సౌకర్యం లేక జనం నానావస్థలు పడుతున్నారు. దీనికితోడు నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు.
            ఏలూరుపాడు కొత్తపేటలో రెండెకరాల 50 సెంట్లు జగనన్న లేఅవుట్‌లో 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లేఅవుట్‌లో ప్లాట్లు క్రాస్‌గా కేటాయించారు. వైసిపి నాయకులు మంతెన రవివర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్లాట్లు క్రాస్‌ రాకుండా లేఅవుట్‌ సరి చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏలూరుపాడు గరువు లేఅవుట్‌ రెండెకరాల 23 సెంట్ల స్థలంలో 90 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ1.80 లక్షలు, డ్వాక్రా ద్వారా రూ.30 వేలు రుణం లబ్ధిదారులకు దశలవారీ అందిస్తున్నారు. జగనన్న లేఅవుట్‌లలో స్థలాలు కేటాయించి రెండేళ్లు దాటినా ప్రధాన, అంతర్గత రహదారుల నిర్మాణం, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాల కల్పన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది.
 

                                                 నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి : లంకపల్లి పుష్పదుర్గ

కొత్తపేట జగనన్న లేఅవుట్‌లో పక్కాగృహం మంజూరైంది. ఇనుము, సిమెంట్‌ అందించారు. ఇసుక కొనుగోలు చేశాను. ఇంటి పునాదులకే కనీసం రూ.60 వేలు ఖర్చయింది. రోడ్డు సౌకర్యం సరిగా లేక అవస్థలు పడుతున్నాం.
 

                                       లేఅవుట్‌లో సౌకర్యాలు కల్పిస్తాం : పి.ఆంజనేయరాజు, హౌసింగ్‌ ఎఇ, కాళ్ల

జగనన్న లేఅవుట్‌లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిమెంట్‌, ఇనుము అందజేస్తున్నాం. కొత్తపేట లేఅవుట్‌లో పేదలు నిర్మించుకునేందుకు 29 ఇళ్లు మంజూరయ్యాయి. 18 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకొచ్చారు. లేఅవుట్‌లో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు రూ.4 లక్షలు, పైప్‌లైన్‌ సౌకర్యానికి రూ.6 లక్షలు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుకు రూ.3.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం.