Oct 31,2022 10:31
  • కెమికల్‌తో డ్రైనేజి నీటి శుద్ధి
  • ప్రయోగాత్మకంగా కుంచనపల్లిలో పరిశీలన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మురుగునీటి శుద్ధికి రాష్ట్రప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనుంది. గతంలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్‌టిపి) ఏర్పాటుచేసి వాటిద్వారా శుద్ధిచేసిన నీటిని కాలువల్లోకి వదిలేవారు. దీనివల్ల నీరు కాలుష్యం కాదు. రాష్ట్రప్రభుత్వం కొత్తగా మురుగునీటికి కాలువల్లోనే ఎక్కడికక్కడ శుద్ధి చేసే టెక్నాలజీని తీసుకోస్తొంది. దీనికోసం ఢిల్లీకి చెందిన 'ఆకాంక్ష' కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. ఈ కరపెనీ కుంచనపల్లి పరిధిలో ప్రయోగాన్ని చేపట్టింది. అంతకుముందే పట్టణాభివృద్దిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌, డైరెక్టర్లకు దీనిపై వివరణాత్మక పత్రం సమర్పించింది. గతంలో ఎస్‌టిపిలకు మురుగునీటిని పంప్‌చేసి అక్కడ వేర్వేరు కెమికల్స్‌ ద్వారా నీటిని శుద్ధిచేసి నీటిని కాలువల్లోకి వదిలేసేవారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు మారిన టెక్నాలజీని వినియోగించుకోవాలని గతంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సమావేశంలో నిర్ణయించారు. అందుకు తగిన విధంగా నూతన టెక్నాలజీ ప్రకారం మురుగునీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలువల్లో పంపింగ్‌ చేసే ప్రాంతంలో కొద్దిదూరం పైపులైను ద్వారా కెమికల్‌ను విడుదల చేయనున్నారు. ఈ కెమికల్‌ పడిన వెంటనే మురుగునీరు అక్కడికక్కడే శుద్ధి అవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్లేనని, ఎస్‌టిపిల వినియోగాన్ని ఆపేయ వచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్‌టిపిలు గతంలో నగరానికి దూరంగా ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో వాటి చుట్టూ ఇళ్లు వచ్చేశాయి. అందులో వాడే కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ జరిగే సమయంలో నీటి ఆవిరి రూపంలో ఇళ్లలో పడుతోంది. నూతన టెక్నాలజీలో అటువంటి సమస్య ఉండదని చెబుతున్నారు. మురుగు కాలువల్లోనే నీరు ఎక్కడికక్కడ క్లీన్‌ అవుతుందని, దీనివల్ల ప్రవాహ సమస్య, డ్రైనేజీలు పొంగడం వంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
 

                                                              ఉపయోగం లేదు : మున్సిపల్‌ ఇంజనీర్లు

భౌగోళికంగా ఇది సాధ్యం కాదని మున్సిపల్‌ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. యుజిడి కనెక్షన్లు ఉంటే పంపింగ్‌ సమయంలో ఇటువంటి కెమికల్‌ను వాడుకోవచ్చని, లేనిపక్షంలో అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఎపిలో ఎక్కువచోట్ల ఓపెన్‌ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, దీనివల్ల ఒక ప్రాంతంలో శుద్ధి చేస్తే మరొక ప్రాంతంలో మురుగునీరు వచ్చి కలుస్తుందని, ఒకేచోటకు తీసుకొచ్చి శుద్ధి చేయడం అంటే దానివల్ల కొత్తగా వచ్చే ఉపయోగం ఏమీ లేదని చెబుతున్నారు.
          ప్రయోగాత్మక ప్రాజెక్టు అయినందున పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే నూతన టెక్నాలజీలోకి వెళతామని స్పష్టం చేస్తున్నారు.