'ఇండియా' తొలగింపు ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదు : పాఠ్య పుస్తకాల్లో ఎన్‌సిఇఆర్‌టి తీరుపై పినరయి విజయన్

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని 'భారత్'తో భర్తీ చేయాలనే ఎన్‌సిఇఆర్‌టి కమిటీ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్‌తో భర్తీ చేయాలని ఎన్‌సిఇఆర్‌టికు చెందిన ఒక ప్యానెల్ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా పినరయి విజయన్ స్పందించారు. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దేశం పేరును 'ఇండియా'గా కాకుండా 'భారత్'గా మార్చాలని ఎన్‌సిఇఆర్‌టి నియమించిన సామాజిక శాస్త్ర కమిటీ సిఫార్సు చేసింది. 'రాజ్యాంగం మన దేశాన్ని ఇండియా, భారత్ అని అభివర్ణిస్తుంది. ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న చేరిక రాజకీయాలకు సంఫ్‌ు పరివార్ భయపడుతోంది. అందులో (సిఫార్సులు) భాగం ఇండియా అనే పదంపై విరక్తి' అని పినరయి విజయన్ అన్నారు.ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అధ్యాయాలను గతంలో మినహాయించడంతో పాటు, ఇండియాకు బదులుగా 'భారత్'ను ఉపయోగించాలనే ప్రతిపాదనను ఖండించారు. 'కొత్త ప్రతిపాదనలు మొఘల్ చరిత్ర, గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం సహా పాఠశాల పాఠ్యపుస్తకాల నుండి ఏకపక్ష మినహాయింపునకు ఇది కొనసాగింపుగా చూడాలి' అని పినరయి విజయన్ అన్నారు. ఎన్‌సిఇఆర్‌టి సంఫ్‌ుపరివార్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తులతో ఉందని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 'సంఫ్‌ుపరివార్ సృష్టించిన బూటకపు చరిత్రను తెల్లగా మార్చేందుకు పాఠ్యపుస్తకాల కమిటీ ఆసక్తిగా ఉంది. భారతదేశం బహుళత్వం, సహజీవనంపై ఆధారపడి ఉండాలనే ఆలోచనకు సంఫ్‌ు పరివార్ ఎప్పుడూ వ్యతిరేకం. దానికి తాజా ఉదాహరణ ఈ ప్రతిపాదన' అని పినరయి విజయన్ అన్నారు. ఎన్‌సిఇఆర్‌టీ కమిటీ సమర్పించిన 'రాజ్యాంగ విరుద్ధ' ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.