Aug 29,2023 10:15
  • ఏడేళ్ల ముస్లిం విద్యార్థిపై తోటి విద్యార్థులను ఉసిగొల్పిన టీచర్‌ దాష్టీకంపై పినరయి విజయన్‌

తిరువనంతపురం : మతోన్మాద నీచ మనస్తత్వానికి నిదర్శనమే ముజఫర్‌నగర్‌ దారుణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. యుపిలోని ముజఫర్‌ నగర్‌లో ముస్లిం విద్యార్ధిపైకి తన సహచర విద్యార్ధులతో కొట్టించిన ఆ టీచర్‌ మతతత్వ విషాన్ని ఎంతగా తలకెక్కించుకున్నారో తెలుస్తున్నదని విజయన్‌ పేర్కొన్నారు. వివక్ష, ఫాసిజం మనిషిలోని ప్రేమ, కరుణ లక్షణాలను చివరి బొట్టువరకు పీల్చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో విజయన్‌ ఒక పోస్టు పెట్టారు. మతం కారణంగా ఏడేళ్ళ పిల్లాడిని తాను శిక్షించాలనుకోవడమే కాకుండా ఇతర మతాలకు చెందిన క్లాస్‌మేట్స్‌తో ఆ శిక్షను టీచర్‌ అమలు చేయించారని అన్నారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని, మతోన్మాద శక్తులు భారత్‌ను విద్వేషానికి నిలయంగా మార్చాలన్న పన్నాగంలో భాగంగానే దీనిని చూడాలని ఆయన అన్నారు. హర్యానా, మణిపూర్‌, యుపిల నుండి వస్తున్న వార్తలు దీన్నే ధృవీకరిస్తున్నాయని అన్నారు. మైనారిటీలను, దళితులను అమానుషంగా హింసించడానికి సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నిస్తోందన్నారు. మృగాల కన్నా అధ్వానమైన సామాజిక స్థితిలోకి వారిని నెడుతోందని అన్నారు. వారి ప్రమాదకరమైన మతోన్మాద ప్రచారం ఒక వ్యక్తిని ఎలా రాక్షసంగా మార్చుతుందో ఈ ఉదంతం తెలియజేస్తోందన్నారు. మతోన్మాదుల విద్వేషపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకతను ముజఫర్‌ నగర్‌ ఘటన ముందుకు తెచ్చిందని, ప్రజాతంత్ర, లౌకికవాదులంతా కలసి ఈ మతోన్మాదాన్ని తుదముట్టించాలని విజయన్‌ పిలుపునిచ్చారు.