Jun 15,2023 21:51

తిరువనంతపురం : పాలనను మరింత మెరుగుపరిచేందుకు, ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లేందుకుగానూ కేరళ ప్రభుత్వం మెగా పబ్లిక్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేరళ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అభివృద్ధి క్రమాన్ని మరింత వేగిరపరిచేందుకు, జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గంటారు. సెప్టెంబరు 4, 7, 11, 14 తేదీల్లో మంత్రివర్గం అధ్యక్షతన కొజికోడ్‌, త్రిస్సూర్‌, ఎరాుకులం, తిరువనంతపురంలలో జోనల్‌ సమావేశాలు జరుగుతాయి. ఆయా తేదీల్లో స్థానిక శాంతి భద్రతల విభాగ అధికారులతో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి విజయన్‌ అధ్యక్షత వహిస్తారు. జిల్లా స్థాయిలో అత్యంత తీవ్రంగా వున్న సమస్యలన్నింటినీ జూన్‌ 20నాటి కల్లా సేకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కేబినెట్‌ కోరింది. జోనల్‌ సమావేశాల్లో వాటిని ప్రవేశపెడతారు. మౌలిక ప్రాతిపదిక సౌకర్యాల అభివృద్ధి ప్రాజెక్టులను కేబినెట్‌ సమీక్షిస్తుంది. సంక్షేమ పెన్షన్ల పంపిణీపై విశ్లేషణ జరుపుతుంది. జిల్లా స్థాయిలో సంక్షేమ కార్యక్రమాల పనితీరును సమీక్షిస్తుంది.
కేంద్ర పథకాల పురోగతిని కూడా మంత్రిత్వ స్థాయి ప్రతినిధి వర్గం సమీక్షించి, వేగంగా అమలు చేయడానికి అడ్డంకులేమైనా వుంటే వాటిని తొలగిస్తుంది. జాతీయ హైవేల అభివృద్ధి, హై రేంజ్‌ హైవేలు, తీరప్రాంత హైవేలు, జాతీయ జల మార్గాలు, బైపాస్‌లు, రింగ్‌ రోడ్లు, ఒవర్‌బ్రిడ్జిలు వీటిల్లో వున్నాయి. ప్రజారోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీలు, సివిల్‌ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి, మరిన్ని మౌలిక సదుపాయాలను అందచేయాల్సిన అవసరం గురించి కూడా కేబినెట్‌ చర్చిస్తుంది. లైఫ్‌ మిషన్‌ ప్రాజెక్టుల పురోగతిని, వాటి నిర్వహణను మంత్రిత్వ స్థాయి సమావేశం సమీక్షిస్తుంది.
సమస్యలను మూడు గ్రూపులుగా జోనల్‌ సమావేశాలు వర్గీకరిస్తాయి, మంత్రిత్వ స్థాయిలో పరిష్కరించగలిగేవి, జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగేవి, ఈ రెండు కేటగిరీల్లోకి రానివి మూడో కేటగిరీగా వర్గీకరిస్తారు. జోనల్‌ సమావేశాలకు ముందుగానే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కరించేందుకుగానూ వివిధ విభాగాల ప్రధాన కార్యదర్శులు కలెక్టర్లతో అనుసంథానమవుతారు. జోనల్‌ సమావేశాల్లో మంత్రులకు చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ కార్యదర్శులు సాయపడతారు. నిర్ణయం జరిగిన 48గంటల్లోగా అవసరమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేస్తుంది.