May 21,2023 06:55

ముదురు నీలం రంగు గౌను, ఆకాశ నీలం రంగు చొక్కా తొడుక్కుని తెల్లరిబ్బన్లతో రెండు జడలు వేసుకుని భుజాన బ్యాగు, బెల్టు, టైతో 'శిక్షా' క్లాసు రూంలోకి అడుగుపెడితే చాలు.. అక్కడి పిల్లలందరూ ఆమె చుట్టూ గుమిగూడతారు. మెరుస్తున్న కళ్లతో అందరి ముఖాలు ఆమెనే చూస్తుంటాయి. అంతేనా.. చుట్టూ చేరిన పిల్లలంతా ఆమె వల్లె వేయించే పాఠాలకు శృతి తప్పకుండా స్వరం కలుపుతారు. పిల్లలను ఇంతలా మంత్రముగ్ధులను చేస్తున్న 'శిక్షా' గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల దృష్టిలో ఆమె ఓ అద్భుతం. ఎందుకంటే 'శిక్షా' అమ్మాయి కాదు.. రోబో.. ముఫ్పై ఏళ్ల అక్షయ్ మష్లేకర్‌ కలల ప్రాజెక్టు 'శిక్షా'. 'పట్టణాలు, నగరాల్లో విద్యార్థులకు విద్యాభ్యాసమంతా అధునాతన వసతుల మధ్య సాగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అలా కాదు. చేతితో తయారుచేసిన కాగితపు చార్ట్‌లు, బ్లాక్స్‌లతోనే వారి విద్యాభ్యాసం సాగాలి. కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల ఊసే ఉండదు. అటువంటి చోట శాస్త్రసాంకేతికతతో ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చో తెలియజేయాలనుకున్నాను. 'శిక్షా'ను పరిచయం చేసి శాస్త్రీయ విజ్ఞానం వైపు పిల్లలను ఆకర్షించాలన్నదే నా లక్ష్యం' అంటున్నారు అక్షయ్.

  • ప్రాథమిక విద్య నేర్పిస్తుంది..

'అక్షరాలు, పద్యాలు, పదాలు, ఎక్కాలు వంటి ప్రాథమిక అభ్యసన పాఠాలను 'శిక్షా' అనర్ఘలంగా చెప్పేస్తుంది. మధ్య మధ్యలో పిల్లలను ప్రశ్నిస్తుంది. లయబద్దంగా తల ఊపుతూ వారితో ఆ పదాలను, పద్యాలను వల్లె వేయిస్తుంది. మా అమ్మ ఉపాధ్యాయిని కావడం వల్ల చిన్నప్పటి నుండే టీచరు కావాలని అనుకునేవాడ్ని. ఉన్నతవిద్య అభ్యసించి కాలేజీ ప్రొఫెసర్‌ అయ్యాను. కోరుకున్న ఉద్యోగం దొరికి తృప్తిగా ఉన్నా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడ్ని. సమయం దొరికేది కాదు. అయితే లాక్‌డౌన్‌ కాలంలో మా గ్రామానికి తిరిగి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు నన్ను ఆలోచనల్లో పడేశాయి. ప్రపంచమంతా సాంకేతికంగా ఎంతో ముందుకుపోతున్నా గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఆ పిల్లల కోసం ఏదైనా వినూత్నంగా చేయాలని అప్పుడే అనుకున్నాను. ఆరు నెలలు దీనిపైనే దృష్టి పెట్టాను. ఆ ఆలోచనలే 2022లో 'శిక్షా'గా రూపాంతంరం చెందాయి' అని చెబుతున్నారు అక్షయ్.
'మన దేశంలో విద్యావ్యవస్థ చాలా దారుణంగా తయారైంది. విద్యార్థులకు సరిపడా టీచర్ల నియామకం లేదు. ఈ పరిస్థితి టీచర్లపై ఒత్తిడి తెస్తోంది. ఫలితంగా విద్యార్థుల చదువు ప్రభావితమౌతోంది. అంటూ ఆవేదనగా చెబుతున్న అక్షయ్ ఉత్తర కర్నాటక 'సిర్సి'లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినా ఓ బృహత్తర లక్ష్యం కోసం పనిచేశారు. 'శిక్షా' కోసం రూ.2 లక్షలు ఖర్చు చేశారు. శిక్షా'లో అనేక పార్శ్వాలు ఉండేలా డిజైన్‌ చేశారు. ఖర్చు తగ్గించుకునేందుకు అధిక మొత్తంతో కూడిన పరికరాలే కాక, ప్లాస్టిక్‌ క్రికెట్‌ స్టంప్స్‌ లాంటివి కూడా ఉపయోగించారు.

  • ఇలా పనిచేస్తుంది...

'అన్ని హంగులతో తయారైన 'శిక్షా' కన్నడ, ఇంగ్లీషుల్లో పాఠాలు చెప్పగలదు. వారాల పేర్లు, రకరకాల ఆకారాలు, ఆంగ్ల అక్షరాలు, గణిత పాఠాలు, గుణకారాలు, కూడికలు, తీసివేతలు వంటివన్నీ చెప్పేస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు కార్డులను ఉపయోగిస్తున్నాం. మాస్టర్‌ కార్డుతో దీన్ని అన్‌లాక్‌ చేస్తాం. నార్మల్‌ కార్డుతో పనిచేయడం ప్రారంభిస్తుంది. మాస్టర్‌ కార్డును 'శిక్షా' చేతిమీద పెట్టగానే ప్రోగ్రామింగ్‌ అడుగుతుంది. అప్పుడు సబ్జెక్టు వారీగా డిజైన్‌ చేసిన కార్డులను శిక్షా చేతిలో పెడితే ఆ కార్డును దాని భుజాల వరకు తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన స్కానర్‌లో స్కాన్‌ చేసుకుని పని మొదలుపెడుతుంది' అని 'శిక్షా' ఎలా పనిచేస్తుందో చెబుతున్నారు అక్షయ్.

  • సైన్సుపై ఆసక్తి పెరిగింది..

ఇప్పటి వరకు గ్రామీణ కన్నడనాట 25 స్కూళ్లలో 'శిక్షా' పాఠాలు చెప్పింది. కెహెచ్‌బి స్కూలు, ఉర్దూ పాఠశాలలకు సైతం వెళ్లింది. 'శిక్షాను తీసుకుని అక్షయ్ మా స్కూలుకు ఏప్రిల్‌లో వచ్చారు. 'శిక్షా'ను చూడగానే మా పిల్లలందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎంతో ఆసక్తిగా దాన్ని చూశారు. వాళ్ల దృష్టిలో శిక్షా రోబో మాత్రమే కాదు.. అది వాళ్ల స్నేహితురాలు.. ఎందుకంటే అది కూడా తమలాగే యూనిఫాం వేసుకుని స్కూలుకు వచ్చింది' అని చెబుతున్నారు మోడల్‌ స్కూల్‌ టీచర్‌ సునయన. ఇంకా 'శిక్షాను చూసిన తరువాత చాలామంది పిల్లలు సైన్స్‌ చేసే అద్భుతాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన ఆ మార్పు నాకు చాలా స్పష్టంగా కనిపించిందని' ఆమె అంటున్నారు.

  • యువ శాస్త్రవేత్తల కోసమే..

'శిక్షాను క్లాసు రూంలోకి ప్రవేశపెట్టడం వెనుక పిల్లలకు రోబోను పరిచయం చేయడమే కాదు.. వాళ్లతో కొత్త రోబోలను తయారుచేయించడం కూడా. ఇందుకోసం ఓ రీసెర్చ్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించాను. యువ రోబో శాస్త్రవేత్తలకు అందులో ప్రవేశం ఉచితం. సిర్సిలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధానా కేంద్రాన్ని రోజుకు 200 మంది పిల్లలు సందర్శిస్తున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారి ఆలోచనలను మరింత పదునుబెడుతున్నాను. 'శిక్షా' ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలనుకుంటున్నాను. సుమారు రూ.35 వేలకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నాను. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్న 'శిక్షా' మున్ముందు మరింతమంది పిల్లలకు చేరువ అవ్వాలి' అని కోరుకుంటున్న అక్షయ్ నిర్వహిస్తున్న రీసెర్చ్‌ సెంటర్‌ గురించి మరిన్ని వివరాలు కావాలంటే 74832 76508 నెంబరుకు ఫోను కాల్‌ చేయవచ్చు.