న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్ పే మరో అడుగు ముందుకేసి విదేశాల్లోనూ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. విదేశీ ప్రయాణాలు చేసే భారతీయుల కోసం పలు దేశాల్లోనూ యుపిఐ పేమెంట్స్‌ను ప్రారంభించినట్లు మంగళవారం ఆ సంస్థ వెల్లడించింది. స్థానిక క్యూఆర్ కోడ్ గల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఐ), సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లోని వ్యాపారస్తుల వద్ద చెల్లింపులకు తమ యాప్ మద్దతు చేయనుందని తెలిపింది. ఆ దేశాల్లో పర్యటిస్తున్న వారు ఫోన్‌పే ద్వారా తమ భారతీయ బ్యాంక్ ద్వారా విదేశీ కరెన్సీలో నేరుగా చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. ఈ సౌకర్యం కల్పిస్తున్న తొలి ఇండియన్ ఫిన్‌టెక్ యాప్ ఫోన్‌పే కావడం విశేషం.










