అవి బ్రిటిష్ పాలన రోజులు. తిరుచురాపల్లి స్టేషన్లో రైలు ఆగింది. కంపార్ట్‌మెంట్లోకి ఇద్దరు రేడియో ఉద్యోగులు ప్రవేశించి, పెట్టెనంతా మొగలి, సంపెంగ పూలు, వికసిత పద్మాలు, కలువలు, గులాబీ, కదంబ పువ్వుల దొంతరలతో అలంకరించారు. ఇంతకీ ఆ పెట్టెలో ప్రయాణిస్తున్నది రేడియో అధికారి ఆచంట జానకీరాం. తెలుగు రేడియో ప్రసారాల ఆద్యుల్లో ఆయనొకరు. జానకీ రాం భావుకుడు, సౌందర్య పిపాసి, సున్నిత మనస్కుడు. ఆయన సంగతి తెలిసే, బదిలీపై తిరుచురాపల్లి నుంచి మదరాసు కేంద్రానికి వెళుతున్న ఆయన ప్రయాణాన్ని అంత సౌందర్య శోభితంగా, పరిమళ భరితంగా మార్చారు సహౌద్యోగులు, ఆయన మీద ప్రేమతో.
దక్షిణ భారతదేశంలో రేడియో ప్రసారాల ఆరంభం నుంచి జానకీరాం కి సంబంధం వుంది. కొద్దికాలం ఢిల్లీ కేంద్రంలో 'క్యాజువల్'గా పనిచేశారు. దక్షిణాదిలో తొలి రేడియో కేంద్రం మదరాసులో 1938లో ప్రారంభమైనప్పుడు జానకీరాంని అక్కడకి పంపింది ప్రభుత్వం. అక్కడ కొన్నాళ్లు పని చేసిన తర్వాత ఆయనకి దక్షిణ భారతంలో రెండో కేంద్రమైన ఆకాశవాణి, తిరుచురాపల్లికి బదిలీ అయ్యింది. కొన్నాళ్ల తర్వాత ఆయనకి తిరిగి మదరాసుకు బదిలీ అయ్యింది. ఆ పరిమళ భరిత ప్రయాణం ఆ సందర్భంలోనిదే !
తెలుగు ప్రసారాల ప్రారంభ సంరంభ సన్నివేశంలో పాలు పంచుకున్న వ్యక్తుల్లో జానకీ రాం ఒకరు. ఆరోజు 1938, జూన్ 16. అప్పటి ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి, అప్పటి కేంద్ర రవాణా శాఖ మెంబర్ అలెగ్జాండర్ క్లవ్‌ని శ్రోతలకి పరిచయం చేయడంతో మదరాసు కేంద్రంలో ప్రసారాలు శుభారంభం అయ్యాయి. తొలి కార్యక్రమంగా 'అనార్కలి' నాటకం ప్రసారమైంది. తెలుగులో మొదటి కవితా సంకలనం 'వైతాళికులు' పుస్తకాన్ని తెచ్చిన ముద్దుకిష్ణే ఈ నాటక రచయిత. నిర్వహణ ఆచంట జానకీ రాం. ఇందులో దేవులపల్లి కష్ణశాస్త్రి సలీం పాత్రని పోషించడం విశేషం.
''రావమ్మ! రావమ్మా! మందారమా
రక్త కరవీరమా
రావే శేఫాలికా! రావే నవ మల్లికా
రావమ్మ! రావమ్మా!''
పిల్లలు పాడిన ఈ క్రిష్ణశాస్త్రి పాటతో నాటకానికి నాందీ ప్రస్తావన జరిగింది. తొలి రేడియో నాటకంగా 'అనార్కలి' చరిత్రలో నిలిచిపోయింది.
తెలుగు సినిమా మొదలైన కొత్తల్లో పౌరాణిక, చారిత్రిక నాటకాల్నే చలనచిత్రాలుగా తీసేవారు. ఇదే ధోరణి రేడియో నాటకాల్లోనూ కనిపిస్తుంది. పౌరాణిక, చారిత్రిక అంశాల్నే రేడియో నాటకాలుగా మలిచి ప్రసారం చేసేవారు.
రుషి కుమారుడు రురూ, అతని ప్రేయసి ప్రమద్వర. రురూని గుడ్డిగా ప్రేమించే మరో యువతి కుముదిని. ఈ త్రిముఖ ప్రేమకథనే భూమికగా చేసుకుని ఒక నాటకం రాశారు జానకీ రాం. తన రసపూరితమైన సంభాషణలతో నాటకాన్ని రక్తి కట్టించారు. ఈ సంభాషణ చూడండి... :
''అగ్నిహౌత్రాల పొగకు అలవాటు పడ్డ నా కళ్లు నీ వినీల కుంతలాల్లో దాక్కుని నిద్రపోవాలని కోరుతున్నాయి...'' ఇది రురూ, ప్రేయసి ప్రమద్వరతో జరిపిన ప్రేమ భాషణ. ఈ సంభాషణను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, మేధావి మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎంతో మెచ్చుకున్నారట. మదరాసు కేంద్రం నుంచి వెలువడిన మొదటి సాంఘిక నాటకంగా 'దయ్యాల లంక' నిలిచింది. దీని రచయిత ప్రముఖ న్యాయ కోవిదుడు, నాటక రచయిత పాకాల రాజమన్నారు. నిర్వహణ జానకీరాం.
రేడియోలో తొలి పుస్తక సమీక్షా కార్యక్రమం నిర్వహించిందీ జానకిరామే. ఈ సమీక్షని శ్రీ కోలవెన్ను రామ కోటేశ్వరరావు చేశారు. ఆయన సమీక్షించిన పుస్తకాల్లో... మల్లవరపు విశ్వేశ్వరరావు 'కళ్యాణ కింకిణి', శివశంకర శాస్త్రి 'వకుళమాలిక', వేదుల సత్యనారాయణ 'దీపావళి' ఖండ కావ్యాలు ఉన్నాయి.
ఉద్యోగ బాధ్యతగా ఆకాశవాణిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే, పత్రికల్లో రచనలు చేశారు జానకీరాం. ఆనాడు ప్రబలంగా వున్న భావ కవిత అంటే ఆయనకి చాలా ఇష్టం. స్వయంగా భావ కవిత్వం రాశారు. జానకీరాం రాసిన భావ కవితను ఒక దాన్ని చూద్దాం.
''ఇదిగో! ఇంకా నిద్ర లేవని
మంచు తడి ఆరని పారిజాతాలు
ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత
ఈ ఎరుపు నా అనురాగ రక్తిమ
ఈ పరిమళము మన స్నేహ సౌరభవము
అందుకోవూ
నీవెక్కడున్నా నీ వద్దకే వస్తాను
భిక్షా పాత్రతో గాని
నవరత్నాలు కూర్చిన కంఠమాలతో గాని'' అంటూ సాగుతుంది ఆ కవిత.
జానకీరాం తన జ్ఞాపకాలను గ్రంథస్థం చేశారు. ఇవి 'నా స్మ ృతిపథంలో', 'సాగుతున్న యాత్ర'గా రెండు భాగాలుగా వచ్చాయి. వీటిని జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్, విశాఖపట్నం వారు ఒకే పుస్తకంగా ప్రచురించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఆయన రేడియో జ్ఞాపకాల్నే ప్రస్తావించినా, తొలి రోజుల నాటి తెలుగు రేడియో ప్రసారాల వెలుగు నీడల్ని సాధికారంగా చెబుతుంది. ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయమూ ఎవరో ఒక కవి రాసిన భావ కవితతో ప్రారంభమవుతుంది. భావ కవిత్వంపై రచయితకు వున్న మమకారాన్ని ఇది తెలియజేస్తుంది.
జానకీరాం కథలు కూడా రాశారు. 'తోటమాలి' అన్న కథ 'భారతి' మాసపత్రికలో అచ్చయింది. రాకుమారిని ప్రేమించిన తోటమాలి కథ ఇది. భావ కవిత్వాన్ని అభిమానించే రచయిత కథలు కూడా అదే ధోరణిలో సాగడం మనకి కనిపిస్తుంది. 'మీరు నవ్వరేమి?' అనేది మరో కథ. ఇదీ ప్రేమకథే. దీనికి సీక్వెల్‌గా మరో కథ కూడా రాశారు రచయిత. ఒక కథకి కొనసాగింపుగా మరో కథను రాయడం జానకీరాం గారికి అలవాటుగా తోస్తుంది.
శ్రీరంగంలో ఎదురైన ఒక అనుభవాన్ని ఆధారం చేసుకుని జానకీరాం 'వడ్డాణము' అన్న కథని రాశారు. ఈ కథలో పురుషునికీ, పురుషునికీ మధ్య గాఢమైన స్నేహం వున్నట్టే, ఒక పురుషునికీ, స్త్రీకి మధ్య అంతటి స్నేహం వర్ధిల్లగలదనే అంశాన్ని ఈ కథలో ప్రతిపాదించారు రచయిత. అప్పటికి ఇలాంటి విషయంపై కథ రాయడం కొంచెం విప్లవాత్మకమైనదే అని చెప్పాలి. 'వడ్డాణము' కథకి కొనసాగింపుగా 'మంగళము' అన్న కథ రాశారాయన. 'వడ్డాణము' కథ మదరాసు నుంచి వచ్చిన 'ప్రజాబంధు' పత్రికలో అచ్చయితే, 'మంగళము' అక్కడి నుంచే వచ్చిన 'చిత్రాంగి' పత్రికలో వచ్చింది. ఇదే పత్రికలో 'మెయిల్ ఆగని స్టేషన్' అనే వినూత్నమైన శీర్షికతో కథ రాశారు ఆయన. 'మా ఊరి స్టేషన్లో మెయిల్ ఆగదు. కాని తీగ సంపెంగ పువ్వులు పూస్తాయి'... అంటూ రచయిత సౌందర్యాత్మక దృష్టిని ప్రతిబింబించే విధంగా కథ మొదలవుతుంది.
ఆచంట జానకీరాం రచనాశైలి సొగసుగా, సౌకుమార్యంగా వుంటుంది. తన 'సాగుతున్న యాత్ర'లో ఒకచోట డ్రెస్సింగ్ టేబుల్‌ని 'శృంగార మేజా' అని ప్రస్తావించారు. అలంకరించుకోవడాన్ని సింగారించుకోవడం అని అనడం మనకి పరిపాటే! ఆ రోజుల్లో డ్రెస్సింగ్ టేబుళ్లు కొంచెం అపురూపమే, కానీ, జానకీరాం వుండేది మదరాసు మహానగరంలో కదా. ఆనాటికే ఉన్నత వర్గాల వారికి అవి అందుబాట్లోకి వచ్చి వుంటాయి.
తెలుగులో ఉత్తమమైన నవలల్లో ఒకటిగా పరిగణించే బుచ్చిబాబు గారి 'చివరికి మిగిలేది కి ఆ పేరును సూచించింది జానకీరాం. ఆ నవలకి రచయిత బుచ్చిబాబు ముందు 'ఏకాంతం' అని పేరు పెట్టారు. బుచ్చిబాబు, జానకీరాం ఆకాశవాణిలో సహౌద్యోగులు. జానకీరాం ఆకాశవాణి పత్రిక 'వాణి'కి సంపాదకులుగా పనిచేశారు. ఆయన శ్రీమతి శారదాదేవి కూడా రచయిత్రే.
జానకీరాం తండ్రి ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి. తల్లి పేరు సీతమ్మ. ఆయన చిన్నతనాన వారి ఇంటికి వీరేశలింగం, గురజాడ, ఉన్నవ లాంటి సాహితీవేత్తలు లక్ష్మీపతి గారితో మాట్లాడటానికి వచ్చేవారు. తండ్రితో వారి సంభాషణలు జానకీరాం శ్రద్ధగా వినేవారు. అలాగే తర్వాత బెజవాడలో ఉద్యోగరీత్యా వున్నప్పుడు అక్కడ ప్రముఖ భావ కవులతో ఆయనకి గాఢమైన స్నేహం ఉండేది. జానకిరాం వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఈ నేపథ్యం ఉపకరించింది. 1903 జూన్ 16న మదరాసులో జన్మించిన జానకీరాం, 1994లో తిరుపతిలో మరణించారు.
(జూన్ 16 : ఆచంట జానకీరాం జయంతి)
- ఎస్.హనుమంతరావు
88978 15656










