
- 10గంటల నుంచే ప్రేక్షకులకు అనుమతి
- టోపీలు, మొబైల్స్, అత్యవసర మందులకు ఓకే...
- హాజరుకానున్న బాలీవుడ్ స్టార్స్
- రేపు భారత్ × పాకిస్తాన్ మహా సంగ్రామం
అహ్మదాబాద్: భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులు పాటించాల్సిన నిబంధనలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జిసిఏ) గురువారం విడుదల చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యాఉదయం 10గంటల నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులు పర్సులు, టోపీలు, మొబైల్ ఫోన్లతోపాటు అత్యవసర మందులను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయని, సుమారు లక్షా 20వేల సీట్ల సామర్థ్యంగల స్టేడియంలో ఈసారి పూర్తిస్థాయిలో ప్రేక్షకులతో నిండుకోనుందని పేర్కొంది. ఇప్పటివరకు విడుదల చేసిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయని, ఈ మ్యాచ్‌కోసం సుమారు 11వేలమంది పోలీసులను నియమించినట్లు జిసిఏ తెలిపింది. దీంతో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని పేర్కొంది. ఇక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇరుజట్లు తొలి రెండు లీగ్ మ్యాచుల్లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్‌కు చేరుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లు గురువారం సాయంత్రం శిక్షణకు వెళ్లేటప్పుడు, బసచేసిన హోటల్ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారతజట్టు ఆటగాళ్లు కూడా చేరుకోవడంతో వారు కూడా స్టేడియంలో నెట్‌ప్రాక్టీస్‌లో కఠోర సాధన చేశారు.
మ్యాచ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు...
వన్డే ప్రపంచకప్‌ముందు ఎలాంటి ప్రారంభోత్సవ వేడుకలు చేయని కారణంగా అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు 45నిమిషాలసాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాల్సిందిగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లకు బిసిసిఐ కార్యదర్శి జే షా గోల్డెన్ టికెట్లను ఇప్పటికే అందజేసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు కేంద్ర హోంమత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
నకిలీ టిక్కెట్ల విక్రయం...
భారత్‌ాపాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను అదునుగా తీసుకున్న కొందరు నకిలీ టిక్కెట్లతో లక్షల రూపాయలు దోచుకున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్‌లో నలుగురు వ్యక్తులు నకిలీ టిక్కెట్ల మోసానికి పాల్పడ్డారు. మొదట ఈ నలుగురు ఒరిజినల్ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత అచ్చం అలాగే పదుల సంఖ్యలో నకిలీ టిక్కెట్లను ముద్రించారు. తొలుత 50 టిక్కెట్లను ముద్రించి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత మరో 200 టిక్కెట్లను ముద్రించారు. ఒక్కో టిక్కెట్‌ను రూ.2వేల నుంచి రూ.20వేలకు విక్రయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు జైమీన్, ధ్రుమిల్, రాజ్ వీర్, ఖుష్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాక్టీస్‌కు హాజరైన శుభ్‌మన్..
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గురువారం నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. డెంగ్యూ జ్వరం కారణం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో మ్యాచ్‌లకు శుభ్‌మన్ దూరం కాగా.. జ్వరం నుంచి కోలుకున్న శుభ్‌మన్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమౌతున్నాడు.