Oct 31,2023 11:15

 'సుప్రీం'లో కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ వెంకట రమణి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్రప్రభుత్వం సమర్థించుకుంది. ఈ పథకం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛమైన ధనం విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చామని తెలిపింది. ఆ విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని పేర్కొంది. ఈ మేరకు సోమవారం కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకట రమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో పారదర్శకత ఉండటం లేదని, ఆశ్రిత పెట్టుబడిదారుల నుంచి పాలక పార్టీలు లబ్ధిపొందుతున్నాయని, ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సిజెఐ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తన వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం 'రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) పరిధిలో ఉంది' అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం.. అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అయితే.. ప్రతిదీ తెలుసుకునే హక్కు వారికి లేదని అటార్నీ జనరల్‌ వాదించారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్‌ డొమైన్లలో ఉండదని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అన్నారు. ఈ పథకం కింద విరాళాలు ఇచ్చేవారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని, పన్ను బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేర్చేలా చేస్తుందని చెప్పారు.