Oct 02,2023 20:26

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, జనసేన పార్టీల అపవిత్ర కలయికను ప్రజలు పూర్తిగా తప్పు పడుతున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును కలిశాక పవన్‌కల్యాణ్‌ చేపట్టిన వారాహి-4 యాత్రకు ఏమాత్రం స్పందన రాకపోవడమే వారి కలయికను ప్రజలు స్వాగతించడం లేదని అర్థమవుతోందన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్‌కల్యాణేనని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ బిజెపితో వుంటూ టిడిపితో పొత్తు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్‌కల్యాణ్‌ సభలు పెడుతున్నారన్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు అని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదని, సైకిల్‌ సైనికులనే అంశాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి డబ్బుతో ఇప్పుడు వారాహి యాత్ర నడుస్తోందన్నారు.