Jun 25,2023 12:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన 4 సంవత్సరాలకాలంలో 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు షాక్‌ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆదివారం ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ చార్జీల పైన కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవికుమార్‌ లు మాట్లాడుతూ ... ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి అధికారంలో చేపట్టినటు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో 8సార్లు కరెంటు చార్జీలో పెంచడంతోపాటు ఏడు రకాల విద్యుత్‌ చార్జీలో దొడ్డిదారిలో ప్రజల పైన భారాలు మోపుతున్నారని అన్నారు. కరెంటు చార్జీలు పెంచడంతో కార్పొరేటర్‌ రంగాలవారికి ప్రజాసొమ్మును దోచిపెడుతున్నారని అన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి వారసుడుగా ఎలాంటి చార్జీలు పెంచబోనని చెప్పి ఎన్నిసార్లు ప్రజల పైన భారాల మోపుతున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సంస్కరణలు తీసుకొని వస్తే ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి తన ఎమ్మెల్యేలను అందరిని కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో నిరాహార దీక్ష చేసి వామపక్ష పార్టీలు బషీర్బాగ్‌ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర జగన్మోహన్‌ రెడ్డి గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమా, కార్పొరేటర్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే సమయంలో రూ.30 వేలు పెట్టి స్మార్ట్‌ మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విద్యుత్‌ ఛార్జీల పెంపుదలతో సంక్షేమ పథకాలు కూడా తీసివేయడానికి కుట్ర చేస్తున్నారని, ఇప్పటికీ అనేకమంది సంక్షేమ పథకాలకు దూరమయ్యారని అన్నారు. పెరిగే విద్యుత్‌ ఛార్జీల వాళ్ళ ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కలిసి వచ్చి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, పలు రకాల చార్జీలను ఉపసంహరించుకునేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవరా, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎమ్మెస్‌ రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కాటంశెట్టి వెంకటయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.