Jan 22,2023 08:17

ఎర్నెస్టో గువేరా లించ్‌, సిలియా డేలాసెరా దంపతులకు కలిగిన సంతానమే ఎర్నెస్టో సిలియా సెలాసెలనా అలియాస్‌ చే గువేరా. ఆయన గురించి తెలుసుకునే ముందు అతన్ని కన్న తల్లిదండ్రుల గురించీ చెప్పుకోవాలి. చే తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్‌ వ్యూనోస్‌ ఏర్స్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుని, ఆర్కిటెక్చర్‌లో పట్టా పొందారు. సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండేవారు. ఈయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. అతివాద భావాలు కలిగి ఉండేవారు. చే తల్లి సిలియా డేలాసెరా కూడా ఉన్నతవిద్యను అభ్యసించారు. ఈమెకు సాహిత్యాభిరుచి ఎక్కువ. మహిళా ఉద్యమంలో పాల్గొని, పురుషులతో పాటు మహిళలకు సమానహక్కులుండాలని నినదించారు. ఎర్నెస్టో, సిలియా ఇద్దరూ ఒకేదగ్గర పనిచేసి, ఒకరి భావాలు ఒకరికి నచ్చి ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లికి ముందు ఇరువురూ కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. తమ జీవితాలు పేద ప్రజలకు ఉపయోగపడాలి. మతాచారాలు పాటించకూడదు. చర్చికి వెళ్లకూడదు. ఈ నిబంధనలు పెట్టుకుని, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరి అభిరుచి రాజకీయాలు, సాహిత్యం కావడంతో ఇంటినిండా స్పానిష్‌, ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలకు చెందిన పుస్తకాలు ఉండేవి. వాటిలో ఫ్రెంచి విప్లవం, ఐరిష్‌ విప్లవం, రష్యన్‌ విప్లవం ఇలా ప్రపంచ విప్లవాల చరిత్రలకు సంబంధించినవి, తత్వ, అర్ధశాస్త్రాలకు చెందినవి ఉండేవి. అవేకాక సోషలిజం, మార్క్సిజం, సిగ్మెంట్‌ ఫ్రై, బుద్ధుడు, మార్క్స్‌, లెనిన్‌, బకునీ, జీన్‌ ఫాల్స్‌ సాత్రే, హెచ్‌.జి.వేల్స్‌, రాబర్ట్‌ హ్రోస్టు, గాంధీ, నెహ్రూ, రసెల్‌, ప్లాబో నెరోడాల రచనలు దాదాపు 300 దాకా ఉండేవి. ఎర్నెస్టో చేస్తున్న సివిల్‌ ఇంజనీరింగ్‌ పని సజావుగా సాగకపోవడంతో విశ్వనెస్‌ పట్టణం దగ్గర ఉన్న తన పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకోసం వారి మకాంను విశ్వనెస్‌ పట్టణానికి మార్చారు. అక్కడ భార్యాభర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుంటూనే కొంతమంది కూలీలను పెట్టుకున్నారు. కూలీలకు కష్టానికి తగిన వేతనం ఇచ్చేవారు. వారి శ్రమను తగ్గించడానికి పనిముట్లు కొన్నారు. వారికి ఆపద వస్తే ఆదుకునేవారు. కూలీలకు మద్యం తాగకూడదనే నియమం పెట్టారు. ఇవన్నీ అక్కడి భూస్వాములకు నచ్చలేదు. ఇలా చేస్తే వారి మాటను కూలీలు వినరనే భయంతో ఆ భూస్వాములందరూ ఒక్కటై ఈ దంపతులిద్దరికీ మతిస్థిమితం లేదనీ, వారు కమ్యూనిస్టులనీ, కూలీలను రెచ్చగొట్టడానికి వచ్చారనీ, రకరకాల నిందలు మోపి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి మాటలకు, మూటలకు తలొగ్గిన పోలీసులు వీరిని వేధించడం మొదలుపెట్టారు. దాంతో వ్యవసాయం సరిగ్గా సాగలేదు. ఇక ఇక్కడ ఉండి లాభం లేదని రోసారయో పట్టణానికి వచ్చి టీ పొడి ఫ్యాక్టరీ పెట్టారు. ఇక్కడే 1928, జూన్‌ 14న చే గువేరా జన్మించాడు. 1929లో చే కు చెల్లెలు సెలియా జన్మించింది. 1930, మే నెలలో రెండు సంవత్సరాలున్న చే ను వాళ్లమ్మ స్విమ్మింగ్‌ ఫూల్‌కు తీసికెళ్లి ఆడిస్తుంటే, ప్రమాదవశాత్తూ చే అందులో మునిగి, నీళ్లు తాగేశాడు. తల్లి వెంటనే చే ను ఇంటికి తీసుకొచ్చి, సపర్యలు చేశారు. ఆ రాత్రంతా ఆయాసం, దగ్గు రావడంతో తెల్లారాక చే ను డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు డాక్టర్‌ పరీక్షించి, అతనికి ఆస్త్మా ఉందని తేల్చి, చెప్పారు. ఆస్త్మా శాశ్వత నివారణకు మందుల్లేవు కాబట్టి, చల్లని వాతావరణం సరిపడదన్నారు. ఇక్కడి వాతావరణం నుంచి మార్పు కావాలన్నారు. వాతావరణ మార్పు కోసం ఐదు సంవత్సరాలలో ఐదు పట్టణాలు మారారు చే తల్లిదండ్రులు. చివరిగా ఆల్ట్రా గ్రాసియాలో స్థిరపడ్డారు. అది కొంత వేడిప్రాంతం కావడం చేత చే ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. బడికి పంపితే ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో తల్లి ఇంట్లోనే చే కు పాఠాలు చెప్పారు. తండ్రి చదరంగం, ఫుట్‌బాల్‌, లెగ్‌ బీ ఆటలు నేర్పించారు. చివరిగా 1936లో మాత్రం స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అక్కడ కార్లో స్పెర్రర్‌ అనే విద్యార్థి స్నేహితుడయ్యాడు. స్కూల్లో ఫుట్‌బాల్‌ ఆడుతున్నప్పుడు ఆస్త్మా కారణంగా ఆయాసం వచ్చి ఇబ్బందిపడినా, గెలవాలనే పట్టుదలతో తన బాధను లెక్కచేసేవాడు కాదు.

family


తల్లి సాహిత్యం గురించి చెబితే, తండ్రి రాత్రివేళల్లో వీర గాథలు, విప్లవ చరిత్రలు వివరించేవారు. నవలలు, కవితలు చదివి వినిపించేవారు. 1936లో స్పెయిన్‌లో వచ్చిన అంతర్యుద్ధం గురించి తండ్రి రోజూ చే కు వివరంగా చెప్పేవారు. రేడియోలో యుద్ధం గురించిన వార్తలు విని చే భావోద్వేగానికి లోనయ్యేవాడు. స్పెయిన్‌ దేశం మ్యాప్‌ ఒకటి తన దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు దేశ భౌగోళిక పరిస్థితులను అంచనా వేసేవాడు. స్నేహితులతో కలిసి స్పానియార్డు, మిలిట్రీ నియంత ఫ్రాంకో పేరుతో గ్రూపులుగా ఏర్పడి, ఆటలు ఆడుకునేవారు.
రెండు సంవత్సరాల పాటు జరిగిన యుద్ధంలో చివరకు నియంత ఫ్రాంకో విజయం సాధించి, ప్రజాస్వామ్యవాదులను, దేశభక్తులను హింసించి, వారిపై దాడులు చేసి, వేలాది మందిని హత్యచేసి, లక్షలాది మందిని జైల్లో పెట్టాడు. ఆ బాధలు తట్టుకోలేక అనేకమంది స్పెయిన్‌ నుంచి బయటకు వచ్చేశారు. అలా ఒక డాక్టర్‌ అక్కడి నుంచి వచ్చి, చే ఇంటిపక్కనే ఉండేవారు. వాళ్ల అబ్బాయితో చే కి స్నేహం ఏర్పడింది. దాంతో చే అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లేవాడు. ఆ డాక్టర్‌ తన కొడుకుతో పాటు చే కి కూడా స్పెయిన్‌ వీరగాథలు, యుద్ధగాథలు చెప్పేవారు. ఆ సమయంలో చే డాక్టర్‌తో రాజకీయాలు, తత్వశాస్త్రం గురించి చర్చలు జరిపేవాడు. పదేళ్లు కూడా లేని చే చదివే పుస్తకాలు, అడిగే ప్రశ్నలు ఆ డాక్టర్‌తో పాటు తల్లిదండ్రులకూ ఆశ్చర్యం కలిగేంచేవట.
ఈ లోగా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం వలన చే రాజకీయాల గురించి మరింత ఆసక్తిని పెంచుకున్నారు. ఆ సమయంలో చే తండ్రి ఫాసిస్ట్‌ కూటమికి వ్యతిరేకంగా 'యాక్షన్‌ అర్జెంటీనా' పేరుతో ఒక కూటమిని తయారుచేశారు. ఈ కూటమికి చే తండ్రే ముఖ్యనాయకుడిగా ఉన్నారు. ఫాసిస్ట్‌ వ్యతిరేక ఉద్యమ నాయకుడు తన తండ్రేనని చే స్నేహితులకు గర్వంగా చెప్పేవాడట. చే స్పానిష్‌తో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలు కూడా నేర్చుకున్నాడు. హైస్కూల్‌ చదువు అయిపోగానే తండ్రిలాగానే ఇంజినీరింగ్‌ చేయాలని ఆయన చదివిన యూనివర్శిటీలోనే 1948లో చేరాడు. అక్కడే అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి, చదువుకునేవాడు. కొన్నిరోజులకు తనను ఎంతో ప్రేమించే అమ్మమ్మ జబ్బుచేసి, చనిపోయింది. తర్వాత చే ని అతని మేనత్త పెంచింది. ఈలోగా కొద్దిరోజులకే 1948, జనవరి 30వ తేదీన ఇండియాలో గాంధీని చంపేశారని తెలిసి, చాలా బాధపడ్డాడు. చేకి కొన్నిరోజులకు ఇంజనీరింగ్‌ చదవాలనిపించక డాక్టర్‌ అయ్యితే, ప్రజలకు సేవ చేయొచ్చని అనుకున్నాడు. అందుకు మెడికల్‌ కాలేజీలో చేరడానికి ఏడాది పాటు అనుమతి పొంది, ఆ సంవత్సరంపాటు సైకిల్‌ మీద దేశమంతా తిరిగాడు. ఆ యాత్ర చే కి చాలా విషయాలు నేర్పించింది. ఆ తర్వాత 1951, డిసెంబర్‌ 29న రెండోసారి బైక్‌పై తన మిత్రుడు అల్బర్టో గైనడాతో కలిసి చిలీ, పెరూ, కొలంబియా, వెనిజులా, మియమీ దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలో ఎంతో మంది ప్రజల దుర్భర జీవితాలను కళ్లార చూశాడు. వీరి కష్టాలకు దోపిడీదారులు, దళారులు, మోసగాళ్లు కారణమని తెలుసుకుని రగిలిపోయాడు. ఆ దేశాలన్నింటిలో సైనిక నియంతలే రాజ్యమేలుతున్నారు.
-నవ్య సింధు