వనపర్తి : ప్రభుత్వం అందజేస్తున్న సహకారం వల్ల రాష్ట్ర పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని హౌం మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా హౌం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 64 శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేశంలో రాష్ట్రం నంబర్‌వన్‌లో ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ అభివఅద్ధి దేశానికి ఆదర్శం గా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడితే ప్రజలు నష్టపోతారని, పది జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడి పోతాయని కొంతమంది తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. కరెంటు ఉండదు. పరిశ్రమలు రావంటూ ఎద్దేవా చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ పట్టుదలతో అన్ని వర్గాలను ఏకం చేసి శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించిన తరువాత ఏర్పడ్డ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనే కారణమని అన్నారు. మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి సురక్షిత మంచినీరు అందుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమర్, కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.