Aug 10,2023 14:49

ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ (విశాఖ) :మణిపూర్‌ ఘటనపై లాజరస్‌ చారిటబుల్‌ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో విభిన్న జాతులు, మతాల మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో స్త్రీలపై అత్యాచారాలు చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ అడ్వకేట్‌ జీవీకే రాజు మాట్లాడుతూ.. స్త్రీలు ఎక్కడైతే గౌరవించ బడతారో అక్కడ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయన్నారు. భారతీయులంతా కుల మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అనే సమైఖ్య భావనను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన తరుణమిదన్నారు. జివిఎంసి కార్యాలయం వద్ద రహదారిపై విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున శాంతి నినాదాలు చేశారు. మనమంతా భారతీయులమని, మతాలు, కులాలు పేరుతో విడిపోకూడదని అన్నదమ్ముల వలె అందరూ మెలగాలని నినదించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అక్కడ తక్షణం శాంతిని, ప్రజల్లో మనోధైర్యాన్ని నెలకొల్పాలన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగి, అక్కడ పరిస్థితులు వేగంగా మామూలు స్థితికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాజరస్‌ చారిటబుల్‌ సంస్థ ప్రతినిధులు లావణ్య బుగ్గ, ఎం.మురళీధర్‌, టి.వెంకటేష్‌, శివ కుమార్‌, కంధ గాయత్రి, బి.ఆశా, స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగిని బి.సంధ్య, ఎన్జీఓ ప్రతినిధి కె.ప్రీతి తదితరులు పాల్గొన్నారు.