- రూ.90 కోట్లు విడుదల చేసిన ఎపి మారిటైం బోర్డు
- మెరైన్ డివిజన్‌కు 55.37 ఎకరాల ముడ భూములు అప్పగింత
- త్వరలో ప్రారంభం కానున్న పనులు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : బందరు పోర్టు రైల్, రోడ్డు కనెక్టవిటీ కోసం భూ సేకరణకు మార్గం సుగమమైంది. జిల్లా అధికారులు ఇప్పటికే భూ సేకరణకు డ్రాప్టు నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ముడ) సేకరించిన రోడ్ రైల్ కనెక్టవిటీకి అవసరమైన భూములను మెరైన్ డివిజన్‌కు బదిలీ చేసింది. మిగిలిన భూముల సేకరణకు అవసరమైన నిధులను ఎపి మారిటైం బోర్డు తాజాగా విడుదల చేసింది. త్వరలో పనులు ప్రారంభించడానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. పోర్టుకు అనుసంధానంగా రోడ్డు, రైల్ కనెక్టవిటీకి మొత్తం 103.75 ఎకరాల భూములు అవసరమవుతాయి. ముడ గతంలో సేకరించిన 659 ఎకరాల్లో 55.37 ఎకరాల భూములను మెరైన్ మచిలీపట్నం డివిజన్‌కు స్వాధీనం చేసింది. చిలకలపూడిలో 19.59 ఎకరాలు, కరగ్రహారంలో 18.91 ఎకరాలు, పోతేపల్లిలో 9.88 ఎకరాల చొప్పున మొత్తం 48.38 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం గతంలో డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూ సేకరణకు అవసరమైన రూ.90 కోట్ల నిధులను ఎపి మారిటైం బోర్డు తాజాగా విడుదల చేసింది. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతోంది.
తీర ప్రాంత భూములకు సరిహద్దులు
పోర్టు బెర్తుల నిర్మాణానికి సంబంధించి నాలుగు గ్రామాల్లోని తీర ప్రాంత భూములకు సరిహద్దులను నిర్ధారించారు. మొత్తం 1688.84 ఎకరాలను సబ్ డివిజన్ చేసి సర్వే నెంబర్లు కేటాయించారు. మచిలీపట్నం మండలం మంగినపూడిలో 185 సర్వే నెంబర్‌లో 806.75 ఎకరాలు, తవిశపూడిలోని 139 సర్వే నంబర్‌లో 312.38 ఎకరాలు, గోపవానిపాలెంలో 152 సర్వే నంబర్‌లో 431.48 ఎకరాలు, కరగ్రహారంలో 335 సర్వే నంబర్‌లో 138.23 ఎకరాలను పోర్టు నిర్మాణానికి కేటాయించారు.
త్వరలో పోర్టు పనులు
బందరు పోర్టు నిర్మాణానికి ఇటీవల కేంద్ర పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ క్రమంలోనే పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో నాలుగు బెర్తుల నిర్మాణానికి రూ.5,156 కోట్లు నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికిగానూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.3,940 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ వారు పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.










