జూన్ 12 నుంచి 15 వరకూ కాకినాడ దంటు కళాక్షేత్రంలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, కొత్తగా ఏర్పడిన కాకినాడ కల్చరల్ అసోసియేషన్ తోడ్పాటుతో తన మొదటి ఆహ్వాన నాటికల పోటీలను ఘనంగా నిర్వహించింది. ఈ పరిషత్‌లో ప్రదర్శించిన ఏడు నాటికలు 2022- 23 నాటికల సీజన్లో అత్యుత్తమ నాటికలుగా పేరు తెచ్చుకుని అనేక పరిషత్తుల్లో పలు బహుమతులు గెల్చుకున్నవే! ఆయా సమాజాల వారిని ఆహ్వానించి ప్రేక్షకుల మనసులను ఉల్లాసపరుస్తూ వర్తమాన సాంఘిక తెలుగు నాటికల గుణాత్మక ప్రదర్శనలను చూపించారు. కాకినాడ కల్చరల్ అసోసియేషన్ మొదటి ధమాకాతోనే తెలుగు నాటికల పరిషత్తులలో, కరెంట్ ట్రెండ్స్ అందులోని వైవిధ్యాన్ని 'జాతీయస్థాయిలో' అని సగర్వంగా ప్రకటించుకునే దానికి అర్హత సాధించుకున్నారు.

సాధారణంగా ఒక మఱ్ఱిచెట్టు నీడన మరొక చెట్టు బతకలేదంటారు. ఒక కొత్త సాంస్క ృతిక సంస్థ సరికొత్తగా మోసులు ఎత్తుతున్న దశలో ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దృఢంగా బాసటగా నిలబడటమే కాక, కాకినాడలోని పలు సంస్థల అధిపతులు వ్యక్తులు నగరంలోని వివిధ హౌదాల్లో ఉంటూ సాంస్కృతిక చైతన్య పరిరక్షకులైన కొందరు పెద్దలు, దంటు భాస్కరరావు డాక్టర్ కెవిఎస్ సీతారాం, డాక్టర్ పివి రావు, రాష్ట్ర ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్ వీరు కాక, కొన్ని వ్యక్తిగత బహుమతులను తన తండ్రి కొర్రపాటి గంగాధర రావు పేరిట సౌజన్యరావు గారు అందజేశారు. ముంజలూరి విశ్వేశ్వరరావు మార్ని జానకిరామ్ చౌదరి, నాగిరెడ్డి సతీష్ రావులు, ఈ నాలుగు రోజుల నాటికల పండుగలో సమాజాల వారికి భోజన వసతి రవాణా ప్రదర్శన పారితోషికాలు, కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి కావల్సిన సేవా సహాయ సహకారాలను అందజేసి జయప్రదం చేశారు.
కాకినాడ కల్చరల్ అసోసియేషన్ తన ఆశయంగా 'ఆలోచనలతో శాస్త్రాలు పుడితే అనుభూతితో కళలు పుట్టాయి. మేధో వికాసం హృదయ స్పందన రెండూ ఉన్నప్పుడే జీవితం సమగ్రమౌతుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోకనాడ నగరంలో సువిశాల మానవీయ లక్ష్యం కోసం సకల జనాల సౌభాగ్యం కోసం సమాజ శ్రేయస్సును సకల కళాసమాహారమైన రంగస్థలం ద్వారా మనోవికాస అభివృద్ధికి కృషి చేసే సంకల్పంతో తమ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు పరిషత్ కన్వీనర్ కె.కృష్ణారావు, ఆల్ కమిటీస్ ఇంచార్జ్ నాదెండ్ల ప్రభుదాసు ప్రకటించారు. మొత్తం కార్యభారాన్ని తమ భుజాల మీద మోస్తూ విజయవంతం చేశారు.
ఈ నాలుగు రోజులూ సభా ప్రాంగణాలకు నలుగురు ప్రముఖుల నాటక కళా సాహిత్య రంగాలకు విశేషమైన సేవలందించి కీర్తిశేషులైన దంటు భాస్కరరావు, బొడ్డు రాజబాబు, ఎం ప్రసాదమూర్తి, టీజే రామనాథం కళా ప్రాంగణాలని పేర్కొనడం, ప్రతిరోజు ఒక నాటకరంగ ప్రముఖుని సత్కరించడం మరొక విశేషాంశం. అందులో నాయుడు గోపి దాక్షారామం సరోజ ఎన్. రవీంద్ర రెడ్డి వైఎస్ కృష్ణేశ్వరరావులను ఆత్మీయంగా సత్కరించారు. చివరి రోజున ప్రత్యేక ప్రదర్శనగా రసఝరి పొన్నూరు వారి కాపలా నాటికను ప్రదర్శించి నాటకోత్సవాల ముగింపును మరింత అర్థవంతం చేసి అందగించారు. రచన వైయస్ భాస్కరరావు, దర్శకత్వం వై.ఎస్. కష్ణేశ్వరరావు ... అలా అన్ని ప్రదర్శనలు.. ఏరోజుకారోజు రెండేసి ప్రదర్శనలు చూసి ఆనందంగా వెళ్లిన ప్రేక్షకులు మరికొందరికి సమాచారం ఇచ్చి దంటు కళాక్షేత్రానికి తీసుకురావడంలో తమ వంతు సహకారం అందించారు.
12వ తేదీ సాయంత్రం మొదటి ప్రదర్శన కళాంజలి హైదరాబాద్ వారి 'రైతే రాజు'. రచన కంచర్ల సూర్యప్రకాష్ దర్శకత్వం కొల్లా రాధాకృష్ణ. 'పిడికెడంత సెల్ఫోన్ లేకపోయినా బతకొచ్చు కానీ రైతు పండించే, పిడికెడు అన్నం పెట్టే వాడిని బతికించుకోలేకపోతే యుగాంతం సమీపించినట్లే' అన్న సందేశం ఇచ్చింది. తన పంటను తాను కనీస ధరకు అమ్ముకోనలేక, ఆరుగాలం కష్టపడి దక్కించుకున్న పంటకు గిట్టుబాటు ధరలను పొందలేక, నానాటికి దారిద్య్ర రేఖ కనిష్ఠ దిగువ స్థాయికి జారిపోతున్న రైతుకు శత్రువులు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. 'రైతే రాజు' అన్న నినాదం నిజంగా సార్ధకమైన నాడే అందరికీ అన్నం దొరుకుతుందని, లేకుంటే ఈ లోకం ఆకలి దప్పులతో అలమటిస్తుందని హెచ్చరిస్తుంది ఈ నాటిక.
ఆనాటి రెండవ ప్రదర్శన శ్రీ అమృత లహరి థియేటర్స్ గుంటూరు వారి 'నాన్నా నేనొచ్చేస్తా' నాటిక. మూల కథ గంటి రాజేశ్వరి. నాటకీకరణ తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం అమృతల హరి. నేటి తల్లిదండ్రులు- పిల్లలపై మితిమీరిన వాత్సల్యం మమకారాలతో స్వేచ్ఛగా పెంచితే, పెళ్లయిన కొద్దిరోజులకే వారి మధ్య అవగాహన రాహిత్యంతో మనస్పర్ధలు పెంచుకొని విడిపోతున్నారు. 'పెళ్లంటే సర్దుబాటు సంసారం అంటే దిద్దుబాటు' అన్న సూత్రాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. 'నాన్న నేనొచ్చేస్తా' అని కాకుండా 'అమ్మా నాన్న, మా ఇంటికి మీరు రండి' అని స్వాగతించడాన్ని దృశ్య రూపకంగా ప్రేక్షకులకు చూపించి సందేశం ఇచ్చిన నాటిక ఇది.
రెండో రోజు మొదటి ప్రదర్శన చైతన్య కళాభారతి కరీంనగర్ వారి 'చీకటి పువ్వు' నాటిక. మూలకథ పిఎస్ నారాయణ. నాటకీకరణ పరమాత్ముని శివరాం. దర్శకత్వం మంచాల రమేష్. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పొందిన తర్వాత కూడా మనిషిని దూరం పెట్టడం, ప్రాణం పోయిన తర్వాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించడం, క్షమించడంలోనే నిజమైన ప్రేమ వ్యక్తం అవుతుందని తెలియచెప్పిన నాటిక, 'చీకటి పువ్వు'. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠను కలిగిస్తూ చీకటి పువ్వుగా ప్రధాన పాత్ర అయిన పవిత్ర (గుడివాడ లహరి) ప్రదర్శించిన హావభావాలతో మమేకమవుతూ కంటతడి పెడుతూ, ప్రతికూల భావాలను ప్రక్షాళన చేస్తూ ప్రేక్షకుల మనసులను తేటపరిచే రంగస్థలం ప్రదర్శన ఇది. దర్శకుడు స్వయంగా హరి పాత్రలో అమానవీయంగా (విలనిజం) వ్యవహరిస్తూ మాటలతో పవిత్రను కుంగిపోయేలా సరికొత్తగా పాత్రను పోషించడం రెండో ప్రత్యేకత. మరింత వన్నె చేకూర్చిన సన్నివేశ గతమైన సంభాషణలు సమకూర్చి పరమాత్ముని శివరాం సమయజ్ఞత పరిణతి కనబరిచారు. ఆనాటి రెండవ ప్రదర్శన 'అందిన ఆకాశం' రచన సాయి పద్మశేఖర్ (అనంత హృదయరాజ్ కలం పేరు) దర్శకత్వం ఎస్‌ఎం బాషా. ఆకాశం వర్షిస్తుంది భూమిపైన, విత్తనాలు మొలకెత్తుతాయి. కానీ, ఆకాశం అందదు, అదే నాన్న అయితే భూమి అక్కున చేర్చుకుంటుంది అదే అమ్మ. ఒక చిన్నారి ఆకాశాన్ని అందుకోవడమే అందిన ఆకాశం నాటిక. రెండే ప్రధాన పాత్రలుగా మూడు రకాల జీవితాన్ని రంగాలంకరణను ప్రతీకగా చేసి సంభాషణల ద్వారా ఆ పాత్రల సాత్వికాభినయాన్ని అర్థం అయ్యేలా చేస్తుంది. నవ యవ్వనంలో ఒక యువతి తొందరపాటు వల్ల పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? అని సమాజం ప్రశ్నిస్తుంటే ఆ తల్లి, ఆ తనయుడు పడే వేదనకు అద్దం పట్టిందీ నాటిక. మూడవరోజు మొదటి నాటిక అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి 'అతీతం' మూలకథ రామా చంద్రమౌళి. నాటకీకరణ శిష్లా చంద్రశేఖర్. దర్శకత్వం ఎన్ రవీంద్ర రెడ్డి. దేవుడు మనిషిని సృష్టించాడు మనిషి బానిసలను సృష్టించాడు. తిరిగి మనిషే పెంచి పోషించిన ప్రపంచీకరణ, మనిషిని యాంత్రికంగా చేసి, సంపద సృష్టిలో అవిశ్రాంతంగా పరుగులు తీయిస్తూ దేశ బంధాన్ని, పేగు బంధాన్ని మరిచి కృత్రిమంగా జీవిస్తున్న పరిస్థితిని దృశ్యమానం చేసింది అతీతం నాటిక.
వయసు పైబడిన తరుణంలో కొందరు తీవ్ర మతిమరుపు వ్యాధికి గురవుతుంటారు. తామెవమో ఎక్కడున్నామో ఏం చేస్తున్నారిమో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాంటి ఒక శారీరక అవస్థను, కన్నబిడ్డలు దూర దేశాల్లో ఉంటూ కనీసం మాట్లాడడానికి తీరుబడి దొరకదు. భార్యా పిల్లలతో కళకళలాడిన ఇల్లు నిర్జీవంగా శ్మశానతుల్యంగా కనబడుతుంటే.. అదిగో అప్పుడు ఈ మానసిక వ్యాధి మరింత ముదిరిపోతుంది. జీవన సహచరికి దుర్భర వేదనను కలిగిస్తుంది. యంత్రంలా, రాయిగా మారిపోతున్న మనిషిని మళ్లీ మనిషిగా చేసేదే అతని సంతానం. అలా ఒకరు అతీతం, మరొక తరానికి కనువిప్పు గుణపాఠం చెప్పేదే ఈ నాటిక.
మూడవరోజు రెండో ప్రదర్శన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బోరివంక శ్రీకాకుళం జిల్లా వారి కొత్త పరిమళం నాటిక. మూలకధ కాండ్రేగుల శ్రీనివాసరావు నాటకీకరణ కేకేయల్ స్వామి దర్శకత్వం.. బిఎంఎస్ పట్నాయక్. జాతి మత ద్వేషాలతో ఇరుగుపొరుగు దేశాలు రగిలిపోతుండగా మానవత్వం మంట కలిస్తే వాటి మధ్య నలిగిపోయిన సరిహద్దు జీవిత గాధే ఇది. సహనాన్ని, క్రౌర్యాన్ని ఎదురు బొదురుగా నిలబెడితే, ద్వేషంతో రగిలే మనసు సైతం వెన్నెలంత చల్లదనాన్ని నెమ్మదితనాన్ని ప్రదర్శించగలిగితే ఆ ఇద్దరి మధ్యే కాదు, ఆ సరిహద్దు గ్రామ ప్రజల్లో మంచుకొండలను కూడా మంచితనపు కొండలుగా మనసుల్లో మార్పు తేగలదనే సందేశంతో కూడిన నాటిక ఇది.
ఈ నాటికల పోటీ ప్రదర్శనలో చివరిరోజు అంటే నాలుగవ రోజు ఏడవ ప్రదర్శన 'నిశ్శబ్దమా, నీ ఖరీదు ఎంత?' తెలుగు లలిత కళా సమితి విశాఖపట్నం వారిది. కథ నాటకీకరణ పి.టి. మాధవ్. దర్శకత్వం చలసాని కృష్ణ ప్రసాద్. వివాహం, దాంపత్యం కుటుంబ జీవనం వీటికి అర్థం ఏమని చెప్పుకుందాం? అక్రమ సంబంధం- నిత్యం కళ్ళెదుట కనబడుతుంటే ఆ పరిస్థితుల్లో నలిగిపోయే పిల్లల పరిస్థితి ఏమిటి? వారి భద్రత మాట ఏమిటి? వారి పెంపకం పోషణ మాటేమిటి ? వివాహేతర సంబంధాలు ఎంత దాకా పయనించి చివరికి ఎలా పరిణమిస్తాయి? ఆర్థికంగా బలంగా కనిపించినా నైతికంగా బలహీనపడితే ఆ ప్రగతి సౌధం ఎంత కాలం నిలబడగలుగుతుంది? అన్న ప్రశ్నను బలంగా వేసే ప్రేక్షక హృదయాల్లో వేడి పుట్టించిన నాటిక ఇది.
ఈ నాటికల పోటీ పరిషత్తులో నిశ్శబ్దమా నీ ఖరీదెంత?, చీకటి పువ్వు, అతీతం నాటికలకు మొదటి రెండు మూడు స్థానాలు ప్రకటించారు. గుణ నిర్ణేతలుగా డాక్టర్ కేజీ వేణు, మల్లేశ్వర రావు ఆకుల, డి రమా సత్యనారాయణ వ్యవహరించారు..
ఈ ఏడు నాటికల ప్రదర్శనలను ఒకసారి సమీక్షించుకుంటే జీవితంలో ఏ చిన్న వాస్తవానికో పెద్ద మోతాదులో కల్పన చేసి తయారుచేసిన నాటకానికీ ఈ కఠోరమైన జీవన వాస్తవాలను అత్యంత ప్రతిభావంతంగా 60 నిమిషాల ప్రత్యక్ష ప్రసారం లాంటి, తడబాట్లకు దిద్దుబాటులకు అవకాశం లేని రియల్ లైఫ్ సైజ్ డ్రామాని, ఎంతో అర్థవంతమైన ముగింపుతో, ప్రేక్షకులను ఆలోచనలకు గురిచేసి ఆధునిక తెలుగు నాటకంపై భరోసా పెంచిన సందర్భం ఇది. ఒక ప్రదర్శన అత్యుత్తమంగా రూపుదిద్దుకోవాలంటే దాని రచన దర్శకత్వం చతుర్విధ అభినయాల సమతూకపు పోషణ, రంగస్థల నేపథ్యంలో బలం చేకూర్చే సాంకేతిక అంశాలు, వేటి స్థానంలో అవి చక్కగా ఒదిగిపోవాలి. పరిషత్ నాటికలు అంటే మూస నాటకాలని చప్పట్లు కొట్టించే మాస్ మసాలా ఉండే డైలాగులు, సెంటిమెంట్లతో కూడిన వ్యవహారం కాదని, ముగ్గురు గుణ నిర్ణేతలు వాళ్ళ ఇష్టానుసారం, నాటిక స్థానాన్ని నిర్ణయించే లోపాయికారి వ్యవహారం కాదని తేల్చి చెప్పింది. అలాగే ప్రభుత్వ సహాయం లేకున్నా, ప్రజలే పోషకులుగా నడిపించే పరిషత్తు నాటకమే తెలుగు నాటకాన్ని బతికిస్తోందని, బతికించుకునేందుకు శ్రమించే నిబద్ధత కలిగిన సమాజాలు ఉన్నాయని భరోసా కల్పించిన కాకినాడ నాటక పరిషత్.
- మల్లేశ్వర రావు ఆకుల
7981872655










