May 08,2023 06:40

అణగారిన వర్గాల ఐరావతం
బతుకు పోరుకు తోటి బాటసారి
అంటూ ముట్టూ తెలియని ఆదర్శవాది
సమానత్వం పాటించే సామ్యవాది
పల్లె జీవుల పవిత్ర బతుకు సారథి

నలుగురైదుగురు కెపాసిటైనా
పదైదు మందిని పట్టక కుక్కినా
కిక్కురుమనకుండా నక్కినట్టుంటది
ఎక్కితే ఇంకొక్కరికి చోటుందంటది
బతుకు జీవుడా అంటూ
బాధపడక ముందుకు సాగుతుంటది
ఆపద వస్తే అంబులెన్స్‌ అవుతది
గతుకుల రోడ్డుపై ఉక్కు గుర్రమైతది
పట్టని నడుమును పట్టిస్తది
పట్టిన నడుమును విడిపిస్తది
పంట పొలమోనికి నేస్తమైతది
పండిన పంటకు అంగడైతది
అలసిన దేహాలకు ఆసరైతది
అమాసపున్నానికి అలిగి ఆగిపోతుంది
ఆయిల్‌ గ్రీస్‌ పెడితే లేసి పరుగు తీస్తది

అతుకుల బతుకుకు ఆదేరవైతది
ఆదరించిన యజమానికి
ఆస్తులు కూడబెట్టకున్నా?
ఆకలి తీర్చే అన్నమైతది!

- డా.ఎడ్ల కల్లేశ్‌, 98667 65126