Sep 08,2023 10:39
  • 'మారణహోమం' అనే పదం ఉదయ్ వాడలేదు : స్టాలిన్‌

చెన్నై : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైనా, సంఫ్‌ు పరివార్‌ నేతల వ్యవహార శైలిపైనా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలోని మూఢచారాలను, వర్ణ వివక్షతను రూపుమాపాలంటూ ఇటీవల తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను బిజెపి వక్రీకరిస్తోందని విమర్శించారు. బిజెపి నేతలు చెబుతున్నట్లుగా 'మారణహోమం' అనే మాటనుఉదరు ఎన్నడూ ఉపయోగించలేదని స్టాలిన్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 'ఏ మతానికి మేము శత్రువులం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. పుట్టక సమయంలో అందరూ సమానమే. అలాగే సమాజంలోనూ అందరూ సమానంగా జీవించాలన్నదే మా ఆకాంక్ష' అని స్టాలిన్‌ తెలిపారు. 'ఇండియా' ఫోరానికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మోడీ అండ్‌ కో ఇలాంటి ఎత్తుగడులకు పాల్పడుతోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి బిజెపి ఇలాంటి అపవాదులపైనే ఆధారపడుతుందని ఆయన చెప్పారు.
 

                                                       తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదు : ఉదయనిధి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో చేసిందేమీ లేదని ఉదయనిధి పేర్కొన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు. తనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశారని దేశం యావత్తు నిలదీస్తోందని, దేశంలో అవినీతి పెరిగిపోయిందనీ, మణిపూర్‌లో హింసాకాండ వంటి ఇతర సమస్యలను నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బిజెపి ఇలాంటి ఎత్తుగడులు వేస్తోందని విమర్శించారు.