Sep 06,2023 18:03

న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. బుధవారం జరిగిన క్యాబినెట్‌ మంత్రుల సమావేశంలో సనాతన ధర్మం వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని మోడీ ఆదేశించారు. ఈరోజు జరిగిన క్యాబినెట్‌ మంత్రుల సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డిఎంకె నేత చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. ఇక రెండవది 'ఇండియా', 'భారత్‌' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు మోడీ సలహా ఇచ్చారు. దీనికి సంబంధించి కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని, మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమివ్వాలని కోరారు.
కాగా, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకుగానూ ఉదయనిధి స్టాలిన్‌పై, ప్రియాంక ఖర్గేపై కేసు నమోదైంది. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదని ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు.