Aug 15,2023 17:01

హైదరాబాద్‌: త్వరలో కాగితం రహిత కోర్టులు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే తెలిపారు. హైకోర్టులో త్వరలో ఆన్‌లైన్‌ పిటిషన్లు దాఖలు చేసేలా ఈ-ఫైలింగ్‌ విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్టు సీజే వెల్లడించారు. హైకోర్టులో సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే జాతీయ పతాకం ఎగరవేసి ప్రసంగించారు. హైకోర్టులోని అన్ని బెంచిల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా విచారణ ప్రక్రియతో పాటు, న్యాయవాదులు ఆన్‌లైన్‌లో వాదించే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతోందని, ఇప్పటివరకు 8 కోట్ల డాక్యుమెంట్లను డిజిటలైజ్‌ చేసినట్టు తెలిపారు.న్యాయ నిర్మాణ డాక్యుమెంట్లకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మొదటి విడతలో చేపట్టనున్న 13 జిల్లా కోర్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు సీజే చెప్పారు. హైకోర్టులో కేసుల పరిష్కారం శాతం పెరిగిందని, న్యాయమూర్తులు, న్యాయవాదుల సహకారంతో వేగవంతమైన విచారణ ప్రక్రియ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.