Jul 16,2023 06:41

ధీరజ్‌ వాళ్ళ నాన్న అశోక్‌ వస్తూ వస్తూ డజన్‌ యాపిల్స్‌ తెచ్చాడు. అవి చూసి ఎంతో సంబరపడిపోయాడు ధీరజ్‌. చెల్లెలు దివ్యతో కలిసి.. ఓ మూడు రోజులు పాటు ఆనందంగా యాపిల్స్‌ తినొచ్చు అనుకున్నాడు. కాస్సేపటికి ''అత్తయ్యా.. రామారావు గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. వెళ్ళి చూసి వస్తాము. పిల్లలూ.. మీరు కూర్చుని మీ హౌంవర్క్‌ పూర్తి చేసుకోండి'' అన్నది ధీరజ్‌ వాళ్ళమ్మ సరస్వతి.
వాళ్ళు వెళ్తూ వెళ్తూ యాపిల్స్‌ ఉన్న కవర్‌ పట్టుకెళ్ళడం చూసీ.. ''నానమ్మా .. అదేంటి అమ్మా వాళ్ళు యాపిల్స్‌ తీసుకెళ్లి పోతున్నారు?'' చిన్న బుచ్చుకుంటూ అన్నాడు ధీరజ్‌.
''ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే మిత్రులు, బంధువులు.. ఇలా యాపిల్స్‌, కమలాలు, కొబ్బరి బొండాలు, బ్రెడ్డు తీసుకెళ్ళి ఇచ్చి పలుకరించి వస్తారురా'' అని చెప్పింది భారతమ్మ.
రెండు రోజులయ్యాక.. ఒక ఉదయం ధీరజ్‌ ''అమ్మో కడుపు నెప్పి. అయ్యో జ్వరం..'' అంటూ అరవసాగాడు. సరస్వతి కంగారుగా వచ్చి ధీరజ్‌ నుదుటి పైన చెయ్యివేసి చూసి ''జ్వరం లేదు కదా..'' అన్నది. వెంటనే ధీరజ్‌ ''అమ్మో కడుపు నెప్పి..'' అంటూ మెలికలు తిరగసాగాడు.
''దివ్యా! అన్నయ్యకి కడుపు నెప్పిగా ఉందట. వాడివ్వాళ బడికి రాలేడుగానీ నువ్వు వెళ్ళు'' అని దివ్యను బడికి పంపించింది. ఆ మధ్యాహ్నం..
''నీకసలే కడుపు నెప్పిగా ఉంది. నువ్వు వేరే ఏమీ తినకూడదు'' అంటూ కొద్దిగా మజ్జిగన్నం పెట్టింది సరస్వతి. ఎవరు ఫోన్‌ చేసినా ''పాపం మా ధీరజ్‌కి కడుపు నెప్పి వచ్చి ఇంట్లోనే పడుకున్నాడు..'' అని సరస్వతి ఫోన్‌లో ఇద్దరు ముగ్గురికి చెప్పడం విన్నాడేమో ఉండుండి గుమ్మం వంక చూడసాగాడు.
''ఎవరి కోసం ఎదురు చూస్తున్నావురా?'' అని అడిగింది భారతమ్మ.
''నానమ్మా, నాకు ఇంత కడుపు నెప్పి వచ్చి పడుకున్నాను. ఎవరన్నా మిత్రులో బంధువుల్లో పలకరించడానికి వస్తారు కదా! అని చూస్తున్నాను'' అన్నాడు ధీరజ్‌.
''బంధువుల కోసమా.. వాళ్ళు తెచ్చే యాపిల్స్‌ కోసమా?'' అన్నాడు అప్పుడే వచ్చిన అశోక్‌. ''లేదు నాన్నా.. నిజంగా బంధువుల కోసమే చూస్తున్నాను'' అన్నాడు గొణుగుతూ..
''ఒరే ధీరజ్‌ నీకు యాపిల్స్‌ అంటే ఇష్టమని నాకు తెలుసు.. మీకోసం ఉంచకుండా రామారావు కోసం పండ్లు తీసుకెళ్లిన నాటి నుండీ నీకు వాటి మీదకు ధ్యాస పోయిందని అమ్మ ఫోన్‌లో చెప్పిందిలే. ఇవిగో నీకు ఇష్టమైన యాపిల్స్‌. కడుక్కుని తిను.'' అన్నాడు.
''ధీరజ్‌.. అసలు జబ్బు పడాలి అని ఎవరూ కోరుకోకూడడు. జబ్బు పడ్డాక పండ్లు తినడం కాదు. తరుచూ పండ్లు తింటే జబ్బులు మన దరికి రావు'' అన్నది భారతమ్మ.
''ధీరజ్‌.. నీకు కావాలంటే వారానికి రెండుసార్లు యాపిల్స్‌ తెస్తాను కానీ, ఇలా అబద్ధాలు చెప్పి బడి మానేయ్యకు. పాఠాలు పోతాయి'' అన్నాడు అశోక్‌.
తాను అబద్ధం చెప్పిన విషయం అమ్మానాన్నలకు అర్థమైనందుకు సిగ్గుపడ్డాడు. తన మనసు తెలుసుకుని కోరిక తీర్చినందుకు సంబరపడ్డాడు. ఇంకెప్పుడూ ఇలా అబద్ధాలు ఆడకూడదని నిర్ణయించుకుని చెల్లికి ఒక పండు కోసి పెట్టి.. తాను ఒక పండు కోసుకుని ఇష్టంగా తినసాగాడు.

- సమ్మెట ఉమాదేవి