Jul 31,2023 20:40
  •  రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌

ప్రజాశక్తి - కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన నాలుగేళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయీ ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక నిధులు రూ.8,066 కోట్లను ఇతర పథకాలకు దారి మళ్లించారని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. సమస్యల పరిష్కారానికి ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఉమ్మడి జిల్లాల సర్పంచులు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాకు టిడిపి, కాంగ్రెస్‌. బిజెపి, జనసేన. సిపిఐ, లోక్‌సత్తా పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇంటి పన్ను, నీటి పన్ను ద్వారా పంచాయతీలకు వచ్చే నిధులను విద్యుత్‌ బిల్లుల బకాయిల సాకుతో ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. పక్కదారి మళ్లించిన నిధులు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. పంచాయతీల అభివృద్ధికి గత ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వ తీరుపై 2న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు లక్ష్మిరెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌ రాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లాల సర్పంచులు, జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.