
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పాలమూరు-రంగారెడ్డి ద్వారా 90 టిఎంసిల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణనుఏ 29వ తేదికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ విషయమై తొలుత కృష్ణా జల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కెడబ్ల్యూడిటి)ను ఎపి ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించే అధికారం తమకు లేదని, తగిన వేదికను ఆశ్రయించాలని సెప్టెంబర్ 20న ట్రిబ్యునల్ సూచించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాయిదా కోరుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున లెటర్ పంపిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఏపీ, తెలంగాణ తరపు న్యాయవాదులు ఉన్నారుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాము కేవియట్ దాఖలు చేశామని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై మరో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఆ పిటిషన్ తదుపరి విచారణ ఎప్పుడు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 29న ఉందని వైద్యనాథన్ తెలిపారు. ఆ పిటిషన్ తో పాటే ప్రస్తుత పిటిషన్‌నూ విచారిస్తామని చెబుతూధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.